న్యూజిలాండ్ ప్రధానితో మోదీ చర్చలు!

12
- Advertisement -

భారత్–న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ – ఎఫ్‌టీఏ)ను ఖరారు చేయడంలో కీలక ముందడుగు పడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టఫర్ లక్సన్‌తో టెలిఫోన్ ద్వారా చర్చలు జరిపి ఈ ఒప్పందాన్ని అధికారికంగా ముగించారు. కేవలం తొమ్మిది నెలల రికార్డు సమయంలో ఈ కీలక ఒప్పందం రూపుదిద్దుకోవడం విశేషం.

ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత విస్తరించనున్నాయన్న ఆశాభావాన్ని ఇరు నాయకులు వ్యక్తం చేశారు. వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడం, అలాగే రానున్న 15 ఏళ్లలో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు 20 బిలియన్ అమెరికన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.

ఈ ఒప్పందం ద్వారా కలిగే లాభాలపై ప్రధాని కార్యాలయం (పీఎంఓ) ప్రకటన విడుదల చేసింది. ఎఫ్‌టీఏ అందించిన బలమైన, విశ్వసనీయ పునాదితో వచ్చే ఐదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెండింతలు చేయగలమన్న విశ్వాసాన్ని ఇరు నాయకులు వ్యక్తం చేశారని తెలిపింది. అలాగే క్రీడలు, విద్య, ప్రజల మధ్య సంబంధాలు వంటి ఇతర రంగాల్లో సాధించిన పురోగతిని స్వాగతిస్తూ, భారత్–న్యూజిలాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలని సంకల్పించినట్లు పేర్కొంది.

ఎఫ్‌టీఏ వివరాలను ఎక్స్ వేదికగా వెల్లడించిన క్రిస్టఫర్ లక్సన్, భారత్‌కు న్యూజిలాండ్ ఎగుమతులపై 95 శాతం టారిఫ్‌లు తగ్గించబడతాయని లేదా పూర్తిగా తొలగించబడతాయని తెలిపారు. ఈ ఒప్పందంతో రాబోయే రెండు దశాబ్దాల్లో న్యూజిలాండ్ నుంచి భారత్‌కు ఎగుమతులు ఏటా 1.1 నుంచి 1.3 బిలియన్ డాలర్ల వరకు పెరిగే అవకాశం ఉందన్నారు.

ఈ ఒప్పందం ద్వారా న్యూజిలాండ్‌లో ఉద్యోగాలు పెరగడమే కాకుండా, ప్రజలకు మెరుగైన వేతనాలు లభిస్తాయని లక్సన్ పేర్కొన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటైన భారత్‌లోని 140 కోట్ల వినియోగదారులకు న్యూజిలాండ్ వ్యాపారాలకు ఈ ఒప్పందం కొత్త అవకాశాలు తెస్తుందని ఆయన అన్నారు. ఈ తాజా ఒప్పందంతో భారత్‌తో ఎఫ్‌టీఏ కుదుర్చుకున్న ఏడవ దేశంగా న్యూజిలాండ్ నిలిచింది.

Also Read:త్వరలో తెలంగాణలోనూ SIR!

- Advertisement -