కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను రద్దు చేయాలని రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి ఈ ఉద్యమం మరింత ఉద్రిక్తతకు దారి తీస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా సంక్షోభ వేళ కూడా భారత్ రికార్డు స్థాయిలో పంటను ఉత్పత్తి చేసినట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. పంట పండించేవాళ్లే దేశ ప్రజాస్వామ్యానికి వెన్నుముక అని ఆయన అన్నారు. యూపీలోని చౌరీ చౌరా శతాబ్ధి వేడుకలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన ప్రధాని మోదీ ఆ తర్వాత మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రగతిలో రైతుల భాగస్వామ్యం ఎప్పుడూ ఉన్నదని, చౌరీ చౌరా ఉద్యమంలోనూ వారి పాత్ర కీలకంగా ఉందని, గత ఆరేళ్ల నుంచి రైతుల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, రైతులను స్వయం సమృద్ధి చేసే దిశగా అడుగులు వేశామని, దీని వల్లే కరోనా మహమ్మారి వేళ కూడా వ్యవసాయం రంగం వృద్ధి చెందినట్లు మోదీ తెలిపారు. రైతుల పురోగతి కోసం ప్రభుత్వం చేపట్టిన చర్యలను మోదీ వివరించారు. రైతుల ప్రయోజనాల కోసం అనేక కార్యక్రమాలు చేపట్టామని, మండీల ద్వారా రైతులు లబ్ధి పొందేందుకు.. మరో వెయ్యి మండీలను ఈ-నామ్‌కు లింకు చేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.
చౌరీ చౌరా ఘటనలో అమరులైన వారిని స్మరించుకోకపోవడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. చరిత్ర పుటల్లో వారి త్యాగాలకు అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోయినా.. ఈ నేలపై చిందిన వారి రక్తం మాత్రం ఎప్పటికీ అందరికీ స్ఫూర్తినిస్తూనే ఉంటుందని కొనియాడారు. చౌరీ చౌరా ఘటన ఒక్క పోలీస్ స్టేషన్ కే పరిమితం కాదన్నారు. ఆ స్టేషన్‌కు పెట్టిన నిప్పు కొన్ని కోట్ల గుండెల్లో ఉద్యమ జ్వాల రగిల్చిందన్నారు. అయితే, కొన్ని కారణాల వల్ల చౌరీ చౌరా పోరాటాన్ని చిన్న ఘటనగానే చిత్రీకరించారన్నారు. దేశ ఐకమత్యమే మన ప్రాధాన్యం కావాలని, దానికి ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. అన్నింటికన్నా ముఖ్యంగా ఐక్యతకే ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. ఈ క్రమంలో దేశంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని పోవాలని ప్రధాని మోదీ సూచించారు.