100వ కిసాన్‌ రైలు ప్రారంభించిన ప్రధాని..

29
modi

ప్రధాని నరేంద్ర మోదీ 100వ కిసాన్‌ రైలును సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. 100వ కిసాన్‌ రైలు మహారాష్ట్రలోని సంగోలా నుంచి పశ్చిమ బెంగాల్‌లోని షాలిమార్‌ మధ్య వస్తువులను రవాణా చేయనుంది. కాలిఫ్లవర్స్‌, క్యాప్సికం, క్యాబేజి, మునగ కాయలు, ఉల్లిగడ్డలతో పాటు ద్రాక్ష, నారింజ, ధానిమ్మ, అరటి, సీతాఫలాలను ఈ రైలు రవాణా చేయనుంది. ఆగష్టు 7న మహారాష్ట్రలోని దేవ్‌లాలి నుంచి బీహార్‌లోని దనపూర్‌కు మొట్టమొదటి కిసాన్‌ రైలును కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత దీనిని ముజఫర్‌ పూర్‌ వరకు పొడిగించింది. తాజాగా 100వ రైలును ప్రభుత్వం ప్రారంభించింది.

ఈ సందర్భంగా ప్రధాని యోదీ మాట్లాడుతూ..నాలుగు నెలలుగా కిసాన్‌ రైల్‌ నెట్‌వర్క్‌ను పెంచుతున్నట్లు తెలిపారు. సరుకు పరిమాణంతో సంబంధం లేకుండా ఆయా మార్గంలోని అన్ని ప్రాంతాల నుంచి త్వరగా పాడైపోయే కూరగాయలు, పండ్ల లోడింగ్‌, అన్‌లోడింగ్‌కు అనుమతి ఉంటుందని తెలిపారు. దేశంలోని 80 శాతం సన్న, చిన్నకారు రైతులకు కిసాన్‌ రైలు ద్వారా ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. రైతుల సాధికారతలో కిసాన్‌ రైలు ఓ పెద్ద ముందడుగని ప్రధాని అభివర్ణించారు. వారానికి ఓ సారి రైలు అందుబాటులో ఉంటుందని, రైతుల నుంచి మంచి స్పందన వస్తే వారానికి మూడురోజులు నడుపుతామని చెప్పారు. రవాణాకు కేంద్రం 50 శాతం రాయితీ వర్తిస్తుందని వెల్లడించారు. వ్యవసాయ ఉత్పత్తులను దేశవ్యాప్తంగా వేగంగా రవాణా చేయడంలో కిసాన్‌ రైలు పెనుమార్పు తీసుకువచ్చిందన్నారు ప్రధాని మోదీ.