కేంద్రంలో మత్స్య శాఖ లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. గురువారం తమిళనాదు, పుదుచ్చేరి పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కేంద్రంలో మత్స్య శాఖ లేదని, దాని కోసం ఓ శాఖను ఏర్పాటు చేయాలని రాహుల్ చెప్పడంతో షాక్ అయ్యా. నిజానికి కేంద్రంలో మత్స్య శాఖ అనేది ఒకటుంది. 2019లోనే ఆ శాఖను ఏర్పాటు చేసింది కూడా మేమే అని ఆయన అన్నారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించి ‘విభజించు–పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించిందని, కాంగ్రెస్ విధానం కూడా అదేనని అన్నారు.
కాంగ్రెస్ ది ‘విభజించు–అబద్ధమాడు–పాలించు’ సిద్ధాంతమని అన్నారు. అందులోని కొందరు నేతలు సందర్భానికి తగ్గట్టు ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పుదుచ్చేరికి ‘హై కమాండ్’ పాలన అవసరం లేదన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలకే లాభం కలిగేలా హైకమాండ్ కు తలూపుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ, బీజేపీకి ప్రజలే హైకమాండ్ అని అన్నారు.