చైనాలోని టియాంజిన్‌లో జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో 20కి పైగా దేశాల నేతల సమక్షంలో ప్రధాని నరేంద్ర మోడీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ ఒకరితో ఒకరు స్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. ఈ ముగ్గురు నాయకులు అమెరికాతో ఉన్న ఉద్రిక్త సంబంధాల నడుమ హర్షాతిరేకంతో కలవడం, ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
అమెరికా ఇటీవల భారత రష్యా చమురు దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించిన నేపథ్యంలో ఈ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యం సంతరించుకుంది. మోడీ తన ‘X’ ఖాతాలో పుతిన్‌తో కలిసిన ఫోటోలను షేర్ చేస్తూ, ఆయనను కలవడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది అని పేర్కొన్నారు.
సమ్మిట్ వేదికపై మోడీ, పుతిన్, షీ జిన్‌పింగ్ ముగ్గురు కలసి స్నేహపూర్వకంగా సంభాషిస్తున్న దృశ్యాలు 2018లో జరిగిన బ్రిక్స్ సదస్సు సందర్భాన్ని గుర్తు చేశాయి.
ఇదే సమయంలో, మోడీ-షీ జిన్‌పింగ్ మధ్య 50 నిమిషాల పాటు ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. సరిహద్దు సమస్యలను పరిష్కరించుకోవడం, పరస్పర నమ్మకం, గౌరవం, సున్నితత్వం ఆధారంగా భారత్-చైనా సంబంధాలను ముందుకు తీసుకెళ్లాలని మోడీ స్పష్టం చేశారు. 2020లో గల్వాన్ ఘటన తర్వాత చైనా పర్యటనకు మోడీ ఇదే మొదటి సారి కావడం గమనార్హం.
Also Read:ఆఫ్ఘాన్‌లో భారీ భూకంపం..
రెండో రోజు జరిగిన ప్రధాన సమావేశంలో మోడీ ప్రసంగించారు. న్యాయం, సమానత్వం కోసం SCO వేదికను మరింత బలపరుస్తామని ప్రకటించారు.ప్రస్తుతం SCOలో భారత్, చైనా, రష్యా, పాకిస్తాన్, ఇరాన్, కజఖ్‌స్తాన్, కిర్గిజిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, బెలారస్ సభ్యదేశాలుగా ఉన్నాయి.

