భారత్ చైనా సరిహద్దుల్లో జరిగిన ఘర్షణలో 20మంది భారత జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. కాగా భారత్ చైనా వివాదంపై నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు ప్రధాని మోదీ. ఈసమావేశానికి దేశ వ్యాప్తంగా 20 పార్టీలకు ఆహ్వానం పంపారు. పార్లమెంట్ 5గురు కంటే ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీలకు ఆహ్వానం పంపించారు. ప్రధాని మోదీ తరుఫున కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్వయంగా ఆయా పార్టీల అధినేతలకు గురువారం ఫోన్ చేసి అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగనున్న ఈ భేటీలో ప్రధాని మోదీతోపాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా పాల్గొననున్నారు. భారత్ చైనా సరిహద్దు ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుందో తమకు చెప్పాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. దీంతో మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. చైనా వ్యవహార శైలిపై ఏవిధంగా స్పందించాలో ఈ సమావేశంలో చర్చించనున్నారు.