ఇకపై పెట్రోలు బంకులు ఆరు రోజులే పనిచేయనున్నాయి. ఒక రోజు వారాంతపు సెలవు తీసుకుంటాయి. మే 14 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. తెలుగు రాష్ట్రాలతో సహా ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలలో ఆదివారం పెట్రోల్ బంకులను మూసివేయనున్నారు. ఇటీవల ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో తాము ఈ నిర్ణయం తీసుకొన్నామని తెలిపారు భారత పెట్రోలియం డీలర్ల సంఘం కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు సురేశ్ కుమార్.
పర్యావరణ పరిరక్షణ కోసం ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే అత్యవసర సేవల నిమిత్తం ఒక వ్యక్తి ఎప్పుడూ పెట్రోల్ బంకుల్లో ఉంటాడని తెలిపారు. ఆదివారం బంకులు మూసివేసే రాష్ట్రాల్లో ఏపీ, తెలంగాణలతోపాటు తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర, హరియాణా ఉన్నాయి. ఈ నిర్ణయంతో తమకు రూ.150 కోట్ల నష్టం రానుందని అంచనావేశారు. అయితే ఆదివారం డిమాండ్ 40శాతం తగ్గుతుందని చెప్పారు.
అయితే, పెట్రోల్ బంకుల్లో పనిచేసే సిబ్బందిలో ఎవరో ఒకరు కచ్చితంగా బంకుల వద్ద ఉంటారని, తద్వారా అత్యవసర సమయంలో పెట్రోల్ అందించనున్నట్టు చెప్పారు. ఇటీవలె ప్రయోగాత్మకంగా ఐదు ప్రాంతాల్లో రోజుకోసారి పెట్రోల్ రేట్‌ను సవరించే విధానాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ విధానం సక్సెస్ అయితే దేశ వ్యాప్తంగా రోజుకోసారి పెట్రోల్ రేట్ హెచ్చు,తగ్గులపై నిర్ణయం తీసుకోనున్నారు.