లోక్ సభ ఎన్నికల వేళ వాహన దారులకు ఊరట కలిగిస్తూ పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. లీటర్ పెట్రోల్, డీజిల్ పై రూ.2 రూపాయల చొప్పున తగ్గించింది. అయితే దాదాపు రెండేళ్ల నుంచి ఇంధన ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. పెట్రోల్ ధర రూ.110 కి పైనే ఉంటే, డీజిల్ రూ.100 కు పైనే కొనసాగుతూ వచ్చింది, అయితే వీటి ధరలు ఆయా రాష్ట్రాలలో వేర్వేరుగా ఉన్నప్పటికి గతంలో పోల్చితే రెండోసారి మోడి అధికారంలోకి వచ్చిన తరువాత పెట్రోల్ డీజిల్ ధరలు కొండెక్కాయి. వీటి విషయంలో మోడీ సర్కార్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమౌతువచ్చాయి కూడా. పెరిగిన ధరల కారణంగా వాహనదారుడిపై అదనపు భారం పడుతూ వచ్చింది..
అయితే సరిగ్గా ఎన్నికలకు ముందు వీటి ధరలు తగ్గించడంతో కేవలం ప్రజల దృష్టిని ఆకర్శించేందుకే అనే భావన కలుగుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ నమోదు చేయాలని బీజేపీ గట్టి పట్టుదలగా ఉంది. అందుకే ప్రజలను ఆకర్షిందుకు లోపాలను సరి చేసుకునే పనిలో పడింది మోడీ సర్కార్. అందులో భాగంగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించింది. ఇక ముందు రోజుల్లో వంటగ్యాస్ ధరలు కూడా మరింత గట్టించే అవకాశం ఉంది. అలాగే నిత్యవసర ధరల తగ్గింపు, ఇతరత్రా పన్నుల తగ్గింపు.. ఇలా అన్నిటిని తగ్గించి ఎన్నికలకు వెళ్ళేలా బీజేపీ ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.
అయితే ఇన్నాళ్ళు ధరల మోత మోగించి సరిగ్గా ఎన్నికల ముందు తగ్గించడం ప్రజలను ఎంతవరకు ఆకర్షిస్తుందనేది ప్రశ్నార్థకమే. ఏది ఏమైనప్పటికి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గడం వినియోగ దారుడికి ఊరట కలిగించే అంశమే. మరి ప్రస్తుతం తగ్గిన ధరలు ఎన్ని రోజుల వరకు కొనసాగుతాయనేది చూడాలి. ఇక ఎన్నికల్లో భాగంగా త్వరలో విడుదల చేయబోయే బీజేపీ మేనిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై కూడా హామీ ఉన్నట్లు దేశ రాజకీయాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఎలక్షన్ స్ట్రాటజీలో భాగమైన ఇందన ధరలు బీజేపీకి ఎంతవరకు కలిసొస్తాయో చూడాలి.
Also Read:జగన్ సమక్షంలో వైసీపీలోకి ముద్రగడ