రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. రూపాయి విలువ పతనమవుతుండటం పెట్రో ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చమురు ధరల పెరుగుదలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసన వ్యక్తమవుతున్నా కేంద్రం ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తోంది. అంతర్జాతీయ పరిణామాలే కారణమంటూ చేతులు దులుపుకుంటోంది. ఆదివారం కూడా పెట్రోల్ ధర లీటరుకు 12పైసలు, డీజిల్ ధర లీటరకు 10పైసలు పెరిగింది.
దీంతో దేశ రాజధాని దిల్లీలో లీటరు పెట్రోల్ ధర రూ80.50, డీజిల్ రూ.72.10కి చేరింది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.85.35, డీజిల్ రూ.78.98, విజయవాడలో లీటర్ పెట్రోల్ ధర రూ. 86.48, డీజిల్ రూ.79.78, ముంబయిలో పెట్రోల్ ధర రూ. 87.89, డీజిల్ రూ. 77.09కి చేరింది. దాదాపు పక్షం రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా కేంద్రం పట్టించుకోవకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.