ఏటీఎంలలో త‌ప్ప‌ని తిప్ప‌లు…

281
People scramble,panic for notes exchange
- Advertisement -

ఈ రోజు కూడా ఏటీఎం తిప్ప‌లు త‌ప్పేలా లేవు. నిన్న క్యాష్ కోసం ఏటీఎంల‌ను ఆశ్ర‌యించిన జ‌నాల‌కు నిరాశే ఎదురైంది. ఏ ఏటీఎం చూసిన టెంప‌ర‌రిలీ అవుట్ ఆఫ్ స‌ర్వీస్ బోర్డులు క‌నిపించ‌డంతో ప్ర‌జ‌లు అస‌హ‌నానికి గుర‌య్యారు. ఇక చేసేదేమీలేక మ‌ళ్లీ బ్యాంకుల‌కు క్యూ క‌ట్టారు ప్ర‌జ‌లు. బ్యాంకుల్లో నోట్ల మార్పిడికోసం వెళ్లినా.. పెద్దఎత్తున క్యూ లైన్స్ ఉండటంతో… తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కొన్నిచోట్ల డిపాజిట్ మెషిన్స్ పనిచేయడంతో.. అక్కడ కూడా క్యూ లైన్స్ కనిపించాయి.

people queue up outside ATMs

పేదలు తమ దగ్గరున్న సొమ్మును మార్చుకునేందుకు నానాపాట్లూ పడుతున్నారు. శుక్రవారం సర్వర్లు మొరాయించడంతో బ్యాంకు లావాదేవీలు సజావుగా సాగలేదు. ఏటీఎంలు చాలాచోట్ల తెరుచుకోలేదు. పెద్ద నోట్లను మార్చుకోవడానికి, నగదును తీసుకోవటానికి దేశవ్యాప్తంగా ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల వద్ద పెద్ద ఎత్తున బారులు తీరారు. ఏటీఎంలు పని చేయకపోవడం, వాటిల్లో నగదు నిల్వలు త్వరగా అడుగంటడం, బ్యాంకుల్లో సర్వర్లు మొరాయించడంతో ప్రజలు గంటల కొద్దీ వరుసల్లో నిలబడాల్సి వచ్చింది. ఏటీఎంల సేవలు సాధారణ స్థితికి చేరుకోవడానికి పది రోజులు పట్టవచ్చని ఎస్‌బీఐ వెల్లడించింది.

బ్యాంకుల్లో శుక్రవారం కూడా అత్యధికంగా డిపాజిట్లు నమోదయ్యాయి. గురువారం కన్నా రెండు మూడింతలు అధికంగా ప్రజలు పాత నోట్లను బ్యాంకుల్లో జమ చేశారు.నోట్ల మార్పిడికి బ్యాంకులు సరైన ఏర్పాట్లు చేయకపోవడం వల్ల గంటలకొద్దీ క్యూలో నిలబడి అస్వస్థతకు గురై దేశంలోని వేర్వురు ప్రాంతాల్లో ఇద్దరు మరణించగా మరొకరు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయారు.

జేబులో పది వేల రూపాయల నోట్లు ఉన్నా.. వంద నోటు ఉన్నవాడి వైపు ఆశగా చూసే దుస్థితి. ఎందుకంటే.. పాత నోట్లు చెల్లకపోవడం.. మార్కెట్లో చిల్లర కొరత.
రెండురోజుల తర్వాత ఏటీఎంలను తెరిస్తే కష్టాలు తీరుతాయనుకున్నవారికి ఆ కోరిక తీరలేదు. పోనీ బ్యాంకులు తెరుచుకుంటే ఇబ్బంది ఉండదనుకుంటే ఆ ఆశలూ సన్నగిల్లిపోయాయి.

people queue up outside ATMs

కొన్ని ప్రైవేటు సంస్థలు రద్దయిన రూ.1000, 500 నోట్లతో ఉద్యోగులకు రెండు, మూడు నెలల జీతాలు ముందుగానే ఇచ్చేస్తున్నాయి. వాటిని సొంత ఖాతాల్లో జమ చేసుకోండి లేదంటే మార్చుకోండని చెబుతున్నాయి. పెద్ద నోట్ల రద్దుతో..నల్ల కుబేరులు నల్లధనానికి బంగారం రంగు పూస్తున్నారు. అధిక సొమ్ము చెల్లించి అయినా…అందిన మేరకు పాత నోట్లను బంగారం కింద మార్చుకుంటున్నారు.అర్ధరాత్రి వరకు బంగారు దుకాణాల్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మాజీ కాగ్‌, బ్యాంక్‌ బోర్డు ఛైర్మన్‌ వినోద్‌ రాయ్‌ అభినందించారు. ఇంతవరకు ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన కింద 25 కోట్ల బ్యాంకు ఖాతాలుండగా వాటిలోనే రూ. 45 వేల కోట్ల మేర డిపాజిట్లున్నట్లు తెలిపారు. రద్దు చేసిన నోట్ల జమలకు ఉన్న గడువు (డిసెంబరు 30) నాటికి వారంతా జమచేసే డబ్బుతో జన్‌ధన్‌ ఖాతాల్లో మొత్తం చాలామేర పెరిగే అవకాశం ఉందని వివరించారు.

people queue up outside ATMs

- Advertisement -