కాంగ్రెస్‌కు షాక్..సోనియాకు కరెంటు బిల్లులు పోస్ట్

34
- Advertisement -

ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి చెప్పినట్టు తమ కరెంటు బిల్లులు సోనియాగాంధీనే కట్టాలని హైదరాబాద్ ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలోని నాగోల్ బస్తీ వాసులు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో చెప్పినట్టు 200 యూనిట్ల వరకు విద్యుత్ బిల్లు మాఫీ చేయకపోవడంతో.. కరెంటు బిల్లు స్లిప్, గతంలో కాంగ్రెస్ నాయకులు చెప్పిన మాటల వీడియోతో కూడిన పెన్ డ్రైవ్, కరెంటు బిల్లు చేయాలని కొరుతూ లేఖ రాసి కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీకి పోస్ట్ చేశారు.

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడిన తర్వాత రెండు సార్లు కరెంటు బిల్లు వచ్చిందని.. ఇప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంపై వారు మండిపడ్డారు. అధికారంలోకి వస్తే 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదని ఆనాడు రేవంత్ రెడ్డి చెప్పారని వారు గుర్తు చేశారు. 200 యూనిట్ల లోపే ఉన్నా తమకు కరెంటు బిల్లు వచ్చిందని.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. సోనియాగాంధీ వచ్చి తెలంగాణ ఆడబిడ్డల కరెంటు బిల్లులు కడతారని రేవంత్ రెడ్డి చెప్పారని.. అందుకే సోనియాగాంధీకే కరెంటు బిల్లులు పోస్ట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇచ్చిన మాట మరిచిపోయారేమోననే అనుమానం ఉందని, అలాగే కరెంటు బిల్లులు ఎలా ఉంటాయో సోనియాగాంధీకి కూడా తెలియాలనే లెటర్లు పోస్ట్ చేసినట్టు చెప్పారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి మాట్లాడుతూ.. కర్నాటకలో ఎలాంటి షరతులు లేకుండా 200 యూనిట్ల వరకు గృహవినియోగదారులందరికి కరెంటు బిల్లు రద్దు చేశారన్నారు. అదే విధంగా తెలంగాణలో కూడా గృహ విద్యుత్ వినియోగదారులందరికి 200 యూనిట్ల వరకు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టొచ్చన్నారు. ఇప్పుడు ఒక బస్తీ నుంచి కేవలం పదుల సంఖ్యలో ఉత్తరాలు వస్తున్నాయని.. వచ్చే నెల కూడా కరెంటు బిల్లు విషయంలో నిర్ణయం తీసుకోకుంటే లక్షల్లో బిల్లులు ఢిల్లీకి వస్తాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాగోల్ బస్తీ మహిళలతో పాటు, స్థానిక బీఆర్ఎస్ నాయకులు సతీష్ యాదవ్, జగన్మోహన్ రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు షఫీ పాల్గొన్నారు.

Also Read:Harshrao:కృష్ణా జలాలపై కాంగ్రెస్ వైఖరేంటీ?

- Advertisement -