ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ నుంచి తరిమికొట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. ఖానాపూర్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన సీఎం…ఓటు వేసే ముందు ప్రజలు ఆలోచించాలని సూచించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ప్రజల ముందు ఉందన్నారు. తెలంగాణ అనతి కాలంలో దేశంలోనే టాప్‌గా నిలబెట్టామన్నారు.
ఎన్నికలు వస్తాయి,పోతాయి కానీ ప్రజలకు ఉపయోగపడే పార్టీ అధికారంలోకి వస్తేనే అందరూ బాగుపడతారని తెలిపారు. రాజకీయాలపై గ్రామాల్లో చర్చ జరగాలని..అనుకున్న అభివృద్ధి జరగాలంటే టీఆర్ఎస్‌కు ఓటేయాలన్నారు. పొరపాటు చేస్తే తెలంగాణ ఆగమవుతుందన్నారు. మహాకూటమిలో పార్టీకో మేనిఫెస్టో ఉందని..ఎవరు ఏ మేనిఫెస్టోని అమలు చేస్తారో వారికే స్పష్టత లేదన్నారు.
సమైక్య పాలనలో సమస్యలన్నీంటిని కాంగ్రెస్,టీడీపీలు పెండింగ్‌లో పెట్టిందని మండిపడ్డారు. నాలుగేళ్లలో తెలంగాణలో జరిగిన అభివృద్ధిని చూసి దేశం అబ్బురపడుతుందన్నారు. రైతు బంధు,రైతు భీమాతో రైతులకు అండగా ఉన్నామని చెప్పారు. పెన్షన్ దారులను గత సర్కారు ఎలా చూసింది..ఇప్పుడు మేము ఎలా ఆదరిస్తున్నామో చూడాలని కోరారు.దేశంలో రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. ఖానాపూర్ అభివృద్ధి చెందాలంటే టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు సీఎం.