ఉత్తరాంధ్ర తిరుపతిగా ప్రఖ్యాతిగాంచిన పెందుర్తి వెంకటాద్రిపై దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే. శాంతి నూతన సంవత్సరం రోజున అలజడి రేపారు. హైందవ సంప్రదాయానికి వ్యతిరేకంగా భక్తుల పైన అర్చకులు పైన పెద్ద పెద్ద కేకలు వేస్తూ చిందులేశారు. భక్తులు ఎదురు తిరగడంతో అసహనంతో వెనుదిరిగారు. రోజు వందల్లో వచ్చే భక్తులు, నూతన సంవత్సరం, శనివారం కలిసి రావడంతో 20 వేల మందికి పైగా భక్తులు స్వామి దర్శనానికి వచ్చారు. దీంతో వెంకటాద్రి భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రసాదం పంపిణీ వద్ద భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కింద నుండి కొండపై వరకు వాహనాలు నిలిచిపోయాయి.
ఆ సమయంలో దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ కే. శాంతి అక్కడికి వస్తూ ట్రాఫిక్‌లో చిక్కుకుపోయారు. కొంత దూరం నడిచి కొండపైకి చేరుకున్న ఏసీ శాంతి అనూహ్యంగా ప్రధానార్చకుడు రామానుజంపై ఆగ్రహంతో రగిలిపోయారు. ప్రసాదం పంపిణీ సక్రమంగా లేదని, ఏర్పాట్లు సరిగా లేవంటూ పరుష పదజాలంతో ఏకవచనంతో దుర్భాషలాడుతూ చిందులేశారు. ఆమె వ్యవహార శైలిపై ఆగ్రహోదగ్రులైన భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఏసీని నిలదీశారు. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ఎంతో కష్టపడి వెంకటాద్రిని శక్తివంతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దిన అర్చకుడు రామానుజంను దూషించడం దారుణమని, వెంటనే క్షమాపణ చెప్పాలని మహిళా భక్తులు డిమాండ్ చేశారు. హిందూ సంస్కృతిని మలిన పరిచేలా ఏసీ శాంతి వ్యవహరించారని మండిపడ్డారు. ఆమెపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భక్తులు ఆవేదనపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా అసహనంతో అక్కడి నుండి వెళ్ళిపోయారు.