రాష్ట్రంలోని అర్చకులకు ముఖ్యమంత్రి కేసీఆర్ దసరా కానుక ప్రకటించారు. సమైక్య రాష్ట్రంలో అన్నిరంగాలతో పాటు అర్చకులకు అన్యాయం జరిగిందన్న కేసీఆర్ ఇక నుంచి …ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో పే స్కేలు అమలు చేస్తామని ప్రకటించారు. ప్రగతి భవన్‌లో అర్చకులతో సమావేశమైన సీఎం కేసీఆర్.. వారి సమస్యలు, వేతనాల పెంపు, చెల్లింపులు, ఆలయాల నిర్వహణ, ధూపదీప నైవేద్యంతో పాటు తదితర అంశాలపై చర్చించారు.
ఆలయాల భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్చకులకు, ఆలయ ఉద్యోగులకు ఇక నుంచి ప్రతినెల 1వ తేదీన జీతాలు అందుతాయని తెలిపారు. అర్చకులకు గౌరవం దక్కుతున్న పూటగడవని పరిస్ధితి నెలకొందని ఇక నుంచి ఆ పరిస్ధితి మారాలన్నారు.
ప్రస్తుత రాష్ట్రంలోని 1805 దేవాలయాల్లో అమలవుతున్న ధూప దీప నైవేద్య పథకాన్ని మరో 3 వేల దేవాలయాలకు వర్తింపు చేస్తామని తెలిపారు. దేవాలయాల నిర్వహణ, సంబంధిత అంశాల పర్యవేక్షణకు ధార్మిక పరిషత్ ఏర్పాటు చేశామని తెలిపారు సీఎం కేసీఆర్. ఈ సమావేశంలో మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్ రావు, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు కె.వి.రమణాచారి, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు, దేవాదాయ శాఖ కార్యదర్శి శివశంకర్, జాయింట్ కమిషనర్ కృష్ణవేణి, ప్రత్యేక కార్యదర్శి భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.