గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ‘గేమ్ చేంజర్ ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. ఈవెంట్‌ను వీక్షిస్తున్న ప్రతీ ఒక్కరికీ నమస్కారాలు. అలానే పవన్ కళ్యాణ్ అభిమానులకు కూడా నమస్కారాలు (నవ్వుతూ). మన సినిమా పరిశ్రమకు మూలాలైనా రఘుపతి వెంకయ్య నాయుడు, దాదా సాహెబ్ ఫాల్కే, రాజ్ కపూర్, సత్య జిత్ రేని మర్చిపోలేం, తెలుగు ఖ్యాతిని ఎగరేసిన నాగిరెడ్డి గారిని, బీఎన్ రెడ్డి గారిని, రామబ్రహ్మం గారు, తెలుగు జాతి కీర్తి పెంచిన ఎన్టీ రామారావు గారిని, ఏఎన్నార్ గారిని తలుచుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉన్నా.. రామ్ చరణ్ ఉన్నా.. దానికి కారణం చిరంజీవి గారు. మీరు కళ్యాణ్ బాబు అని అరిచినా, ఓజీ అని అరిచినా, డిప్యూటీ సీఎం అని అరిచినా దానికి చిరంజీవి గారే ఆద్యులు. సీఎం చంద్రబాబు గారి సహకారం, మద్దతు వల్లే ఈ రోజు ఇక్కడ ఇలాంటి ఈవెంట్‌ను నిర్వహించుకోగల్గుతున్నాం. హోం మినిస్టర్ అనిత గారికి, డీజీపీ గారికి, జిల్లా యంత్రాంగానికి థాంక్స్. ఈ రోజు కార్యక్రమానికి వచ్చిన మంత్రులు, ఎమ్మెల్యేలకు నమస్కారాలు. శంకర్ గారు చేసిన జెంటిల్మెన్ సినిమాను చెన్నైలో చూశాను. ప్రేమికుడు సినిమాకు అమ్మమ్మతో వెళ్లాను. సామాజిక సందేశాన్ని అందిస్తూ శంకర్ గారు సినిమాలు తీస్తుంటారు. ఈ రోజు రాజమౌళి గారు, రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు గ్లోబల్ స్థాయికి వెళ్లారు. దానికి కొంత మంది సౌత్ దర్శకులు కారణం. అందులో శంకర్ గారు ఒకరు. తమిళంలో శంకర్ గారు సినిమాలు తీసి తెలుగు వారిని మెప్పించారు. ఆయన తెలుగులో సినిమా చేస్తే బాగుంటుందని ఎప్పటి నుంచో అనుకున్నాను అన్నారు.
ఇక దిల్ రాజు నా తొలిప్రేమ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. నేను బాగా కష్టాల్లో ఉన్నప్పుడు వకీల్ సాబ్ సినిమా ఇచ్చారు దిల్ రాజు. ఆయన ఇచ్చిన డబ్బులే జనసేనకు ఇంధనంగా మారింది. మేం ఆంజనేయ స్వామి భక్తులం. అన్నయ్యకు అబ్బాయి పుట్టాడని మా నాన్న గారు ఎంతో ఆలోచించి రామ్ చరణ్ అని పేరు పెట్టారు. రాముని చరణాల వద్ద ఉండే వాడు.. ఆంజనేయుడు.. ఎంత బలం ఉన్నా వినయ విధేయంగా ఉంటాడు.. హనుమాది సిద్దులున్నా కూడా ఎంతో వినయంగా ఉండేవాడు.. అందుకే రామ్ చరణ్ అని మా నాన్న పేరు పెట్టారు. నాకు చిరంజీవి పితృసమానులు. నేను రామ్ చరణ్‌కు బాబాయ్‌లా ఉండను. రామ్ చరణ్ నాకు సోదర సమానుడు. రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు అవార్డు వస్తుందని అనుకున్నాను. గోదారి తీర ప్రాంతాల్లో జీవించకపోయినా.. అద్భుతంగా నటించారు. తండ్రి మెగాస్టార్ అయితే కొడుకు గ్లోబల్ స్టార్ అవుతాడు. సంకల్ప బలం, పట్టుదల, కార్యదక్షత ఉంటే.. అందరూ మెగాస్టార్ చిరంజీవిలా ఎదగొచ్చు. ఆయన అంతలా ఎదగబట్టే నేను ఈ రోజు ఇలా ఈ స్థాయిలో ఉన్నాను. మా అన్నయ్య చిరంజీవి షూటింగ్‌లు చేసి ఇంటికి అలిసిపోయి వచ్చేవారు. ఆ టైంలో ఖాళీగా ఉండే నేను.. ఆయన షూస్, సాక్సులు తీసి కాళ్లు తుడిచేవాడిని. ఈ హీరో సినిమా పోవాలని మా జీవితంలో ఎప్పుడూ అనుకోలేదు. సర్వేజనా సుఖినోభవంతు అని మా తండ్రి గారు మాకు నేర్పించారు. అందరూ బాగుండాలని మేం కోరుకుంటాం. రామ్ చరణ్ హార్స్ రైడింగ్ చూస్తే నాకు అసూయగా అనిపిస్తుంది. నాకు హార్స్ రైడింగ్ రాదు. కానీ గబ్బర్ సింగ్ టైంలో హార్స్ రైడింగ్ పెట్టారు. నాకు హార్స్ రైడింగ్ రాదు అని గుర్రం దగ్గరకు వెళ్లి చెప్పా. దానికి క్యారెట్ పెట్టాను. అది నన్ను సురక్షితంగా తీసుకెళ్లింది. కానీ రామ్ చరణ్ మాత్రం హార్స్ రైడింగ్‌లో శిక్షణ తీసుకున్నాడు. ఈ గేమ్ చేంజర్ ట్రైలర్ చూశాను. నాకు చాలా నచ్చింది. సామాజిక సందేశం ఇచ్చేలా ఉందనిపిస్తోంది. ఈవెంట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరూ క్షేమంగా తిరిగి వెళ్లాలి. మీకు ఏమైనా అయితే నా గుండెకు గాయమైనట్టుగా ఉంటుంది. సినిమాను సినిమాలా చూడండి. టికెట్ రేట్లు డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. తెలుగు సినిమా స్థాయి పెరిగింది. ప్రతీ టికెట్ మీద జీఎస్టీ ఉంటుంది. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. సినిమా రంగానికి రాజకీయ రంగు పులమడం నాక్కూడా ఇష్టం ఉండదు. అన్ని ఇండస్ట్రీల వ్యక్తులు కలిసి సినిమాల్ని చేస్తున్నారు. హాలీవుడ్‌ని అనుకరించడం కాకుండా మన మూలాల్ని పైకి తెచ్చేలా కథల్ని తీసుకురావాలి. స్వర్గీయ ఎన్టీరామారావు ఎప్పుడూ కూడా ఎవ్వరి మీద వివక్షను చూపించలేదు. చంద్రబాబు గారు సైతం ఎప్పుడూ తెలుగు చిత్ర సీమ అభివృద్దికి దోహద పడుతూనే ఉన్నారు. శంకర్ గారు తీసిన ఒకే ఒక్కడు, శివాజీ వంటివి చూస్తుంటే ఓ తృప్తి కలుగుతుంది. సినిమాలో మంచి చెడులూ ఉంటాయి. ఏది తీసుకోవాలనేది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. వినోదంతో పాటు ఆలోచింపజేసే చిత్రాలు కూడా రావాలని కోరుకుంటున్నాను అన్నారు.
విలువల్ని నేర్పించే చిత్రాలు మరిన్ని రావాలని కోరుకుంటున్నాను. ఆంధ్ర ప్రదేశ్ తరుపున గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి, శంకర్ గారికి, దిల్ రాజు, శిరీష్ గార్లకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. ఎస్ జే సూర్య గారు చాలా మంచి దర్శకులు. ఆయనలో మంచి నటులు కూడా ఉన్నారు. నటుడు కావాలనే కోరిక ఉందని ఎప్పుడూ చెబుతూనే ఉంటారు. నటుడిగా ఆయన అందరినీ ఆకట్టుకుంటున్నారు. గేమ్ చేంజర్ టీంకు ఆల్ ది బెస్ట్. కొత్త సంవత్సరంలో బాక్సాఫీస్ బద్దలైపోవాలి. మగధీరుడు, అల్లూరి సీతారామరాజుగా జీవించేశాడు.. రామ్ చరణ్ అందరి హీరోలకు చాలా మంచి ఫ్రెండ్.. ఏడాదికి కనీసం వంద రోజులు అయ్యప్ప మాల, ఆంజనేయ స్వామి మాల అని అంటాడు. అహంకారం రాకుండా ఉండాలని చేస్తుంటాని చెబుతుంటాడు. ఆస్కార్ వరకు వెళ్లినా ఒదిగే ఉంటాడు. ఉంటే సూట్‌లో కనిపిస్తాడు.. లేదంటే అయ్యప్ప మాలలో చెప్పులు లేకుండా కనిపిస్తాడు.. రామ్ చరణ్ మా బంగారం.. నా తమ్ముడులాంటి వాడు.. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండేవాడు.. అద్భుత విజయాలు కలగాలని బాబాయ్‌గానే కాకుండా అన్నగానూ ఆశీర్వదిస్తున్నాను’ అని అన్నారు.
Also Read:సినిమాను సినిమాలా చూడండి!