పవన్‌ రాజకీయ యాత్ర..కొండగట్టు నుంచి మొదలు..

281
Pawan Kalyan's political tour from Kondagattu
- Advertisement -

జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ తన రాజకీయ యాత్రను తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. పర్యటన ప్రణాళికనూ అక్కడే ప్రకటిస్తానని వెల్లడించారు. సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా ప్రజల ముందుకు వస్తున్నానని శనివారం ట్వీట్‌ ద్వారా తెలిపారు .

సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం ఈ యాత్ర చేపడుతున్నట్లు పేర్కొన్నారు. 2009 ఎన్నికల ప్రచారం సందర్భంగా కొండగట్టు వద్ద జరిగిన పెను ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడ్డానని గుర్తుచేసుకున్నారు. తమ కుటుంబ ఇలవేల్పు ఆంజనేయస్వామి కావడం వల్లే యాత్రను కొండగట్టు నుంచి ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు. యాత్ర ఎప్పుడు ప్రారంభమయ్యేది పవన్‌ ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు తెలిపాయి.

Pawan Kalyan's political tour from Kondagattu

పోలాండ్‌ దేశ అంబాసిడర్‌ ఆడమ్‌ బురాకోవస్కీ, మరో 20 మంది విద్యార్థులు జనసేన అధ్యక్షులు పవన్‌కళ్యాణ్‌ను హైదరాబాద్‌లోని పార్టీ పరిపాలన కార్యాలయంలో నేడు కలవనున్నారు. గత నవంబర్‌లో పవన్‌ ఇంగ్లాండ్‌ పర్యటన సందర్భంగా కొంత మంది పోలెండ్‌ దేశస్థులు కలిశారు. వారి ద్వారా పవన్‌ గురించి తెలుసుకున్న బురాకోవస్కీ.. సమావేశమయ్యేందుకు వస్తున్నారని పార్టీ వర్గాలు శనివారం తెలిపాయి.

కాగా ఆదివారం పవన్ కళ్యాణ్ సికింద్రాబాద్ సెయింట్ మేరీస్ చర్చిలో ప్రార్థనలు చేశారు. పోలాండ్ అంబాసిడర్ ఆడమ్ బురాకోవస్కీతో కలిసి పవన్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ ఉదయం 7 గంటలకే తన సతీమణి అన్నాతో కలిసి పవన్ చర్చికి వెళ్లారు. తన రాజకీయ యాత్ర ప్రారంభానికి ముందు సర్వమత ప్రార్థనలు చేయనున్నట్లు ఆయన వెల్లడించిన విషయం తెలిసిందే.

- Advertisement -