అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్త శ్రీ స్టీవ్ జార్డింగ్ తో జనసేన చీఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ సుదీర్ఘంగా చర్చలు జరిపారు. భారతీయ కాలమానం ప్రకారం ఈ రోజు వేకువ జామున బోస్టన్‌లోని చార్లెస్ హోటల్ లో శ్రీ పవన్ కళ్యాణ్ జార్డంగ్ ను కలుసుకున్నారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని కెనెడీ స్కూల్ లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న జార్డింగ్ కు పబ్లిక్ పాలసీ, రాజకీయ వ్యూహాల రూపకల్పనలో విశేష అనుభవం ఉంది.
అమెరికాలోని రాజకీయ పార్టీలతో పాటు, అంతర్జాతీయంగా వివిధ రాజకీయ నేతలకు శ్రీ జార్డింగ్ రాజకీయ సూచనలు, సలహాలను అందిస్తున్నారు.విజయవంతమైన రాజకీయ వ్యూహకర్తగా ఖ్యాతి గడించిన శ్రీ జార్డింగ్ నుంచి ములాయంసింగ్ యాదవ్ ఆధ్వర్యంలోని సమాజ్ వాదీ పార్టీ ఎక్కువగా సలహాలను స్వీకరిస్తుంది. ప్రస్తుత యూ.పీ అసెంబ్లీ ఎన్నికల కోసం జార్డింగ్ రూపొందించిన వ్యూహాలనే అఖిలేష్ యాదవ్ అమలు చేస్తున్నారు.
సుమారు రెండు గంటలపాటు ఈ భేటీ కొనసాగింది. ఈ భేటీలో జార్డింగ్ 2019 శాసన సభ ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయో వివరించారు. ఎటువంటి ఎత్తుగడలు అవలంభించాలి, అభ్యర్థుల ఎంపిక ఎలా జరగాలి తదితర వివరాలను విశ్లేషణాత్మకంగా తెలియచేసారు.
ఈ సందర్భంగా శ్రీ జార్డింగ్ కు శ్రీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
వీలయితే ఎన్నికల ముందు మరోసారి కలుద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ ఆయనకు తెలిపారు. ఉదయం పది గంటలకు న్యూక్లియర్ నిపుణుడు ప్రొఫెసర్ శ్రీ మాథ్యూబన్, ఎనర్జీ పాలసీ రూపకర్త శ్రీ హెన్రీలీతో శ్రీ పవన్ కళ్యాణ్ సంభాషించారు.