జనసేన అధిపతి పవన్ కల్యాణ్ సమర శంఖం పూరించారు. 2019 ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు, తన అభిమానులకు పిలుపునిచ్చారు. ఎన్నికలకు సన్నాహంగా వచ్చే మార్చిలో రెండు తెలుగు రాష్ట్రాల జనసేన ప్లీనరీని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. శనివారం ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తలతో ఒంగోలులో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా… బీజేపీ, టీడీపీ, వైసీపీలపై విమర్శలు గుప్పించారు. 2012లోనే జనసేనను స్థాపించి, 2014 ఎన్నికలలో పోటీ చేసి ఉంటే తెలుగుదేశం గెలిచేదా అని పవన్ ప్రశ్నించారు.
ప్రభుత్వం, ప్రతిపక్షం కలిపి ప్రత్యేక హోదా ఎందుకు అడుగులేకపోతున్నాయని ప్రశ్నించారు. ‘‘ప్రత్యేక హోదాపై నేను ఎందుకు పోరాడటం లేదని అడుగుతున్నారు. నేను సిద్ధమే.. యువతగా మీరు సిద్ధంగా ఉన్నారా? ప్రజలు, రాజకీయ పార్టీలు సిద్ధమా? తెలంగాణ రాష్ట్ర సాధనకు అక్కడి ప్రజలు, యువత ఉద్యమం చేశారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం చాలా కష్టం. ప్రధాని మోదీకి ఎదురెళ్లాలని అనుకోను. వెళ్లాల్సి వస్తే భయపడను’’ అని వ్యాఖ్యానించారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల జనసేన కార్యకర్తల సమావేశం శనివారం ఒంగోలులో జరిగింది. ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై ఆయన మాట్లాడారు.
‘‘నాడు సంస్థానాలన్నీ దేశంలో విలీనమైనప్పుడు రాజభరణాలు ఇవ్వడాన్ని కొందరు వ్యతిరేకించారు. కానీ, పార్లమెంట్‌లో మాట ఇచ్చాం కాబట్టి నెరవేర్చాలని సర్దార్ పటేల్ చెప్పారు. నేడు హోదా విషయంలో పార్లమెంట్‌లో మాట ఇచ్చి తప్పారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వరో కారణాలు చెప్పాలి. అవి సంతృప్తి, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండాలి. అత్యధిక ప్రజలు ఒప్పుకొంటేనే అంగీకరిస్తాం. రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదా కోరుతూ ఒక తీర్మానం చేయాలి. ఒక స్పష్టత కోరాలి. కారణాలు అడగాలి’’ అని అన్నారు. నైతిక బలంతోనే గాంధీ బ్రిటిష్ వాళ్ల దగ్గర; లోక్‌నాయక్ జయప్రకాష్ ఇందిర వద్ద ఎంతో స్థిరంగా వ్యవహరించారని నేడు అది లోపించిందని అన్నారు. ప్రభుత్వాలు నైతిక హక్కుని కోల్పోకూడదని, పదేపదే మాటలు మార్చడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు.
పరిటాల రవి నాకు గుండు కొట్టించినట్లు కొందరు తెదేపా నాయకులు దుష్ప్రచారం చేశారు. కానీ వ్యక్తిగత కక్షలు, కోపాలు ప్రజలకు నష్టం. అందుకే అవమానాలను దిగమింగి వాళ్లకు ప్రచారం చేశా. అది ప్రజల పట్ల నా బాధ్యత’’ అని పవన్ పేర్కొన్నారు. ‘‘స్వచ్ఛభారత్ అంటూ బయట మురికిని శుభ్రం చేస్తామంటున్నారు. మీ భావజాలంలోని మురికి, మీ మనసులోని మలినం, మకిలీ, అంధకారం పోవాలి. అలాంటి స్వచ్ఛభారత్ కావాలి. జనసేన అదే సాధిస్తుంది. అదే మా ‘చలోరె చలోరె చల్’ ఉద్దేశం’’ అని ఆయన స్పష్టం చేశారు. అమిత్‌షా తనను భాజపాలోకి వచ్చేయమన్నారని కానీ తాను వెళ్లలేదన్నారు.
ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో కృష్ణానది పడవ ప్రమాదలో మృతుల కుటుంబాలను పవన్‌కల్యాణ్ పరామర్శించారు. మంత్రులు నిర్లక్ష్య ధోరణిని వీడాలన్నారు. తల్లిదండ్రులను కోల్పోయిన పర్యాటక మంత్రి అఖిలప్రియ మరింత మానవీయతను ప్రదర్శించాల్సిందన్నారు. ‘‘నాడు ఓ రైలు ప్రమాదం జరిగితే లాల్‌బహుదూర్‌శాస్త్రి రాజీనామా చేశారు. ఇప్పుడు కనీసం మీరు పరామర్శకు రాలేదు. మీరు వచ్చి వీళ్ల బాధలు ప్రత్యక్షంగా తెలుసుకుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలిసేది. నేను పర్యాటకశాఖ మంత్రిగా ఉంటే వెంటనే మొత్తం ప్రక్షాళన చేసేవాణ్ని’’ అని అన్నారు.