తొలిదశ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పటివరకు ఓటర్లను ప్రసన్నం చేసుకున్న నేతలు ఇక భారం దేవుడిపై వేశారు. కొంతమంది విహారయాత్రలకు వెళ్లి ఎంజాయ్ చేస్తూంటు మరికొంతమంది ఆలయాలను సందర్శిస్తున్నారు. జనసేన అధినేత, సినీనటుడు పవన్ కల్యాణ్ ఇవాళ గుంటూరు జిల్లా పెదకాకాని మండలం నంబూరులో దశావతార వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తలు పవన్‌కు ఘన స్వాగతం పలికారు. గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. వెంకన్నకు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో నిత్యాన్నదానం కోసం జనసేన అధినేత రూ.1.32కోట్లను అందించారు. స్వయంగా భక్తులకు వడ్డించారు పవన్. పవన్ వెంట నాదెండ్ల మనోహర్, అంజిబాబు ఉన్నారు.
ఇక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించే ముందు తెలంగాణలోని కొండగట్టు అంజన్నను పవన్ దర్శించుకున్న సంగతి తెలిసిందే. అంతేగాదు కొండగట్టు అంజన్న గుడికి పవన్ రూ.11 లక్షల విరాళం ఇచ్చారు.