‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ప్రసారం చేసిన వీడియోలను మార్ఫింగ్ చేసినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు. మార్ఫింగ్ చేసిన వీడియోలను ట్విట్టర్‌లో పోస్టు చేసి చానల్ పరువుకు భంగం కలిగించేలా వ్యవహరించినందుకు భారతీయ శిక్షా స్మృతి 469, 504, 506 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై పోరాడుతున్న సినీ నటి శ్రీరెడ్డి ఓ సందర్భంలో విలేకరులతో మాట్లాడుతూ పవన్ తల్లిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. తన తల్లిపై శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్‌లో పదేపదే చూపించారన్నది పవన్ ఆరోపణ. పవన్ ఆరోపణలను ఖండించిన ఏబీఎన్.. శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తాము యథాతథంగా ప్రచారం చేయలేదని, ఆమె దూషణను ఎడిట్ చేసి, ఆ వ్యాఖ్య వచ్చినప్పుడు బీప్ శబ్దం ఇచ్చి పలు జాగ్రత్తలు తీసుకున్నామని పేర్కొంది.
ఏబీఎన్ ఎడిట్ చేసిన వీడియోను మార్ఫింగ్ చేసి ట్విట్టర్‌లో పవన్ పోస్టు చేశారని, చానల్ ఎండీపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఏబీఎన్ ప్రతినిధులు, జర్నలిస్టు సంఘాలు రెండు రోజుల క్రితం సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులకు బదిలీ చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు పవన్ ట్వీట్ చేసిన వీడియోను మార్పింగ్ చేసినట్టు ప్రాథమికంగా గుర్తించి కేసులు నమోదు చేశారు.