తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. మూడు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా పాదాల మండపం వద్ద ఆయన స్వామి వారికి మోకాళ్లపై మోకరిల్లి.. నమస్కారం చేసుకుని నడక ప్రారంభించి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం పవన్ చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. పవన్‌ను చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తిరుమలకు చేరుకున్నారు.
ఇవాళ తిరుపతి సమీపంలోని శెట్టిపల్లి గ్రామ పంచాయతీకి వెళ్లి ఆదివారం స్థానికులతో సమావేశం కానున్నారు. ఈ గ్రామంలోని వందల ఎకరాల భూమిపై ఇప్పటివరకూ రెవెన్యూ పరంగా సెటిల్‌మెంట్ కాలేదు. స్థానికులు ఇళ్లు, భవనాలు కట్టుకొని నివాసం ఉంటున్నా.. ఎవరికీ యాజమాన్య పట్టాలు లేవు. ఈ నేపథ్యంలో బాధితులు హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి తమ సమస్యను వివరించారు. గ్రామస్థులతో మాట్లాడేందుకు తాను స్వయంగా వస్తానని పవన్ వారికి హామీ ఇచ్చారు. ఈ మేరకు పవన్ వీరితో సమావేశం కానున్నారు.
అనంతరం పార్టీ కార్యకర్తలతో పవన్ సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో వ్యవహారాలను సమీక్షించనున్నారు. రేపు ఉదయం చిత్తూరుకు వెళ్లనున్నారు. అక్కడ చిత్తూరులోని హైరోడ్డు విస్తరణ కారణంగా నిర్వాసితులుగా మారుతున్న వందలాది మంది కుటుంబాలను ఉద్దేశించి మాట్లాడనున్నారు. పవన్ పర్యటన నేపథ్యంలో జనసేన పార్టీ కార్యకర్తలు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుపతి పర్యటన సందర్భంగా పవన్ బస్సు యాత్ర అనంతపురం జిల్లా శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నుంచా అన్న దానిపై స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది.