హైదరాబాద్ లోని నోవాటెల్ జరిగిన ‘అజ్ఞాతవాసి’ ఆడియో వేడుకలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..‘నా హృదయ వైశాల్యం ఎంత ఉంటుందంటే.. అభిమానించే ప్రతి ఒక్కరినీ నా గుండెల్లో పెట్టుకోవాలని ఉంటుంది’ అని అన్నారు. తన సినిమా చూడమని తానెప్పుడూ చెప్పనని.. బలవంతపెట్టని.. నచ్చితేనే చూడాలని అన్నారు. ఈ సినిమా కోసం చిత్ర యూనిట్ తమ వంతు కృషి చేసిందని చెప్పారు. ‘‘ఖుషీ’ సినిమా తర్వాత కొన్ని సినిమాలు చేసి వెళ్లిపోదామనుకున్నాను.
అయితే, అభిమానుల అభిమానం నాతో మరిన్ని సినిమాల్లో నటించేలా చేసింది. గెలుపు, ఓటములు నాకేమి పట్టదు. కానీ, నా చుట్టుపక్కల వాళ్లు, సన్నిహితులు దీని గురించి బాధపడేవారు. ఒకదశలో సిినిమాలకు దూరంగా వెళిపోదామనుకున్నా. నేను చేయూత నిచ్చిన వాళ్లు, నాకు అండగా నిలవలేదు. కానీ.. అభిమానులు నాకు అండగా నిలిచారు. అభిమానుల కోసం నా గుండె ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటుంది.
నాకు భయం లేదు కానీ, నిరాశ నిస్ప్రుహలు ఉన్నాయి’ అని అన్నారు. ఈ సందర్భంగా దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి పవన్ కల్యాణ్ ప్రస్తావిస్తూ..‘మా ఇద్దరి మధ్య ఉన్న భావజాలం మమ్మల్ని కలిపింది. నా వెన్నుతట్టి, నా గుండెల నిండా ధైర్యం నింపిన వ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివాస్’ అని భావోద్వేగం చెందారు.