శ్రీరాముడిని కించపరిచేలా వ్యాఖ్యలు చేసి ఓ వర్గాన్ని రెచ్చగొట్టేలా చేశారంటూ కత్తి మహేశ్‌పై పోలీసులు ఆర్నెల్ల పాటు నగర బహిష్కరణ విధించిన సంగతి తెలిసిందే. అయితే కత్తి మహేశ్ వ్యాఖ్యలను నిరసిస్తూ చౌటుప్పల్ నుంచి యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద చేపట్టిన పాదయాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించారు.
దీంతో పాటు ఆయన్ని గృహ నిర్బంధం చేశారు. రెండ్రోజుల నుంచి ఆయన బయటకు రాకుండా భద్రత కట్టుదిట్టం చేశారు. పోలీసుల చర్యను హిందూ ధార్మిక సంఘాలతో పాటు భాజపా తీవ్రంగా ఖండించింది. ఈ నేపథ్యంలో స్వామి పరిపూర్ణానందపై పోలీసులు హైదరాబాద్ నగర బహిష్కరణ విధించారు.
గతేడాది నవంబర్‌లో జరిగిన రాష్ట్రీయ హిందూ సేన సమావేశంలో పరిపూర్ణానంద చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగానే బహిష్కరణ విధించినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో స్వామిని హైదరాబాద్ నగరం నుంచి తరలించారు. అయితే, నగరం నుంచి ఆయనను ఎటు తరలించారనే విషయంలో మాత్రం ఇంత వరకు క్లారిటీ రాలేదు.
ఇక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బహిష్కరణకు గురైన తొలి వ్యక్తి కత్తి మహేశ్ కాగా.. రెండో వ్యక్తి స్వామి పరిపూర్ణానంద. ఈ విషయంపై స్వామి పరిపూర్ణానంద మాట్లాడుతూ.. నగర బహిష్కరణపై తన అనుచరులు ఎవరూ ఆందోళన చెందవద్దని చెప్పారు. ధర్మాన్ని న్యాయం నిలబెడుతుందనే నమ్మకం తనకు ఉందని తెలిపారు.