ఓ వైపు దర్శకుడిగా హ్యాట్రిక్ హిట్స్ సొంతం చేసుకొంటూనే మరోవైపు నిర్మాతగానూ తన అభిరుచిని ఘనంగా చాటుకొంటున్న సంపత్ నంది.. “గాలిపటం” అనంతరం మరో వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించేందుకు సన్నద్ధమవుతున్నారు. ఆయన స్వంత నిర్మాణ సంస్థ “సంపత్ నంది టీం వర్క్స్” మరియు ప్రచిత్ర క్రియేషన్స్-బి.ఎల్.ఎన్ సినిమా సంస్థలు సంయుక్తంగా “పేపర్ బోయ్” అనే వైవిధ్యమైన చిత్రాన్ని నిర్మించనున్నాయి. జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మ్యూజికల్ లవ్ స్టోరీలో సంతోష్ శోభన్-ఐశ్వర్య వాట్కర్ జంటగా నటించనున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవం నేడు (జూన్ 8) హైద్రాబాద్ లో జరిగింది.
ఈ ప్రారంభోత్సవ వేడుకలో యువ కథానాయకుడు గోపీచంద్, యువ కథానాయకి కేతరీన్, ప్రముఖ నిర్మాతలు జె.భగవాన్-జె.పుల్లారావు లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం చిత్ర నిర్మాతల్లో ఒకరైన సంపత్ నంది దర్శకుడు జయశంకర్ కు స్క్రిప్ట్ ను అందించగా.. జె.భగవాన్-జె.పుల్లారావులు కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి గోపీచంద్ క్లాప్ కొట్టగా.. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ కేతరీన్ గౌరవ దర్శకత్వం వహించింది.
ఈ సందర్భంగా సంపత్ నంది మాట్లాడుతూ.. “హిలేరియస్ మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కనున్న “పేపర్ బోయ్” ప్రారంభోత్సవానికి నా సన్నిహితులందరూ విచ్చేసి ఆశీర్వదించడం చాలా సంతోషంగా ఉంది. నా “బెంగాల్ టైగర్”తోపాటు “బిల్లా, మాట్రన్” వంటి భారీ చిత్రాలకు సినిమాటోగ్రఫీ వర్క్ తో మంచి వేల్యూ తీసుకువచ్చిన ఎస్.సౌందర్ రాజన్ “పేపర్ బోయ్”కి కెమెరా బాధ్యతలు నిర్వర్తించనుండడం విశేషం. ఈ చిత్రానికి కథ-స్క్రీన్ ప్లే-మాటలు సమకూర్చడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించనుండడం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.
ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో, కళ: రాజీవ్ నాయర్, సినిమాటోగ్రఫీ: ఎస్.సౌందర్ రాజన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మురళి మామిళ్ల, నిర్మాతలు: సంపత్ నంది-వెంకట్-నరసింహ, కథ-స్క్రీన్ ప్లే-మాటలు: సంపత్ నంది, దర్శకత్వం: జయశంకర్!