శశికళకు షాకిచ్చిన పన్నీర్…

235
Panner against Sasikala
- Advertisement -

తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. నిన్నటిదాక చిన్నమ్మ శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తుందా లేదా అనే సందేహం వ్యక్తమవుతుండగానే దివంగత జయలలిత అనుంగ శిష్యుడు ఆపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం గట్టిషాకిచ్చారు. చిన్నమ్మపై తిరుగుబాటు జెండా ఎగురవేశారు. పన్నీర్ చేసిన ఆవేదనా భరిత ప్రకటనతో శశికళకు గట్టిషాకిచ్చింది.

ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం పెద్దగా భయటకు రాని పన్నీర్‌ .. మంగళవారం రాత్రి చెన్నై మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించారు. జయలలిత సమాధి వద్దే దాదాపు అరగంటకు పైగా కళ్లుమూసుకుని కూర్చుని ధ్యానం చేశారు. అనంతరం పన్నీర్‌ సెల్వం మీడియాతో మాట్లాడుతూ.. అంతరాత్మ ప్రబోధం మేరకుఅమ్మకు నివాళులర్పించేందుకు ఇక్కడికి వచ్చానని తెలిపారు. నిజాలు వెల్లడించాలని అమ్మ ఆత్మ నన్ను ఆదేశించింది. పార్టీని, రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మ నన్ను ఆదేశించింది. పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్‌ను నియమించాలని అమ్మ సూచించిందని తెలిపారు.

సీఎంగా చాలా అవమానాలు ఎదుర్కొన్నా. తనకు ఏదైనా జరిగితే సీఎంగా నేనే ఉండాలని అమ్మ కోరుకుంది. అపోలోలో చేర్చేనాటికి అమ్మ పరిస్థితి విషమంగా ఉంది. ఇదే విషయాన్ని 70 రోజుల తర్వాత ప్రకటించా’’ అని వెల్లడించారు. పన్నీర్‌సెల్వం ప్రకటన తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది.కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు.

దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. ‘ఓపీఎస్‌.. ఓపీఎస్‌..’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు. అటు శశికళ కూడా వేగంగా స్పందిస్తూ కీలక నాయకులతో మంతనాలు సాగించారు. చివరికి పన్నీర్‌ను పార్టీ పదవి నుంచి తొలిగించారు. ఒకవేళ పన్నీర్‌ను పార్టీ నుంచి సస్పెండ్‌ చేసినట్లైతే అతని ఇమేజ్‌ మరింత పెరుగుతుందనే భావనతోనే చిన్నమ్మ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు అర్థం అవుతున్నది.

అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా శశికళ ఎన్నికైన వెంటనే పన్నీర్‌సెల్వం సీఎం పదవికి రాజీనామా చేశారు. గవర్నర్‌కూడా సెల్వం రాజీనామాను ఆమోదించారు. తదుపరి ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే వరకు అపద్దర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాలని గవర్నర్‌ కోరారు. శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్న తరుణంలో సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉన్న అక్రమాస్తుల కేసు తెరపైకి వచ్చింది. త్వరలో అక్రమాస్తుల కేసులో తుది తీర్పు వెలువరిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేయడంతో శశికళ ప్రమాణస్వీకారోత్సవం వాయిదా పడింది. దీనికి తోడు జయలలితకు వ్యతిరేకంగా పార్టీలోని కొందరు సీనియర్‌ నేతలు, జయ మేనకోడలు దీపా జయకుమార్‌ నిరసన గళం విప్పారు. దీంతో తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారాయి.

- Advertisement -