పంచాయితీ రాజ్ శాఖ డైరెక్టర్ సృజన కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మొదటి, రెండో దశ పంచాయితీ ఎన్నికలు పూర్తిగా సక్సెస్‌ఫుల్‌గా జరిగాయని ఆమె వెల్లడించారు. ఎక్కడా పెద్దగా అవాంతరాలు లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయగలిగామని తెలిపారు.
మూడో దఫా ఎన్నికల్లో పోలింగ్ శాతం మరింత పెరుగుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అన్ని అంశాలను సమగ్రంగా పరిగణలోకి తీసుకున్నామని తెలిపారు. ముఖ్యంగా ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన సదుపాయాలు కల్పించామని చెప్పారు. వృద్ధులు, మహిళలు, దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు.
అలాగే, రేపు ఉదయానికి కల్లు ఉప సర్పంచ్ ఎన్నికలు కూడా పూర్తికానున్నాయని తెలిపారు. ఈ ఎన్నికల ప్రక్రియ కూడా ప్రశాంతంగా కొనసాగుతోందని, అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.
సాధారణంగా ఈ నెల 20వ తేదీ తరువాత సర్పంచ్‌ల ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని నిర్వహించాలని భావించామని సృజన తెలిపారు. అయితే కొన్ని పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల ఆ తేదీ మార్పు చేయాల్సి వచ్చిందని చెప్పారు. అందువల్ల సర్పంచ్‌ల ప్రమాణస్వీకారాన్ని ఈ నెల 22వ తేదీన చేపట్టాలని నిర్ణయించినట్లు ఆమె స్పష్టం చేశారు. మొత్తం ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్య పద్ధతిలో సజావుగా కొనసాగుతోందని ఆమె పేర్కొన్నారు.

