తాజాగా కన్నడలో క్రాంతి అనే ప్యాన్ ఇండియా సినిమా వచ్చింది. ఇవాళ తెలుగు డబ్బింగ్ తో పాటు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. దర్శన్ హీరో. భారీ ఫాలోయింగ్ ఉంది. మన పోకిరి లాంటి బ్లాక్ బస్టర్స్ రీమేకులు చేసుకుని హిట్లు కొట్టిన ట్రాక్ రికార్డు ఇతని సొంతం. ప్రత్యేకంగా క్రాంతి గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే చాలా భారీ బడ్జెట్ తో దీన్ని తెరకెక్కించారు.
కథపరంగా ధనుష్ సార్ తో పోలిక వస్తుంది కానీ ట్రీట్ మెంట్ పరంగా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా కనిపిస్తుంది. హీరోయిజం ఎలివేషన్ అంటే హీరోల భజనని ఆసాంతం నింపడమనే దానికి మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సార్ లో బాలగంగాధర్ తిలక్ ఉన్నతంగా కనిపిస్తే క్రాంతిలో హీరో ఓవర్ బిల్డప్పులతో నమ్మశక్యం కానీ పనులు స్టంట్లు చేస్తుంటాడు.
కమర్షియల్ చిత్రాల్లో ఇలాంటివి సహజమే కానీ ఏదో సమాజానికి గొప్ప సందేశం ఇస్తున్నట్టు హడావిడి చేసినప్పుడు దానికి తగ్గట్టే ఎమోషన్లు సైతం ప్రాపర్ గా రిజిస్టర్ చేయాలి. లేదంటే అతికి పరాకాష్టగా నిలిచిన ఇలాంటి సినిమాలు తలనెప్పి తెప్పిస్తాయి. అడుగడుగునా గ్రాండియర్ నెస్ ఉట్టిపడే ఈ జీవం లేని గాజుబొమ్మని చూస్తే రాయి వేయనవసరం లేదు గాలి ఊదినా పగిలిపోయేలా ఉంది.