ఒక్క లెక్క తప్పున్నా పోటీ నుండి తప్పుకుంటా- పల్లా

60
palla

నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఇవ్వాళ భద్రాచలం,పినపాక నియోజకవర్గాల్లో జరిగిన సమావేశాల్లో ఎమ్మెల్సీ డా. పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి ఎంపీ మాలోత్ కవిత ఎమ్మెల్యే రేగా కాంతా రావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ కోరం కనకయ్య, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ కార్యదర్శి తాతా మధు తదితరులు హజరైయ్యారు.

ఈ సందర్భంగా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ నాకూ భద్రాచలానికి అవినాభావ సంబంధం ఉంది. నేను చేసుకున్న అమ్మాయి ఇక్కడే మరిగూడెం అమ్మాయి అని అన్నారు.ఇదే మరిగూడెంలో ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుకున్న కాబట్టి ఇక్కడి సమస్యలు మరింతగా తెలిసినవాణ్ణి అని అన్నారు. 2015లో ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత శ్రీ రామ నవమికి భద్రాచలానికి వచ్చిన.. కేసీఆర్‌తో కలిసి భద్రాద్రి పవర్ ప్లాంట్ శంకుస్థాపనలో పాల్గొన్న అని గుర్తు చేశారు. చాలా మంది ఒకటే మాట్లాడ్తున్నరు, ఉద్యోగాలు ఏమన్నా ఇచ్చిండా కేసీఆర్ అని…ఏ ప్రభుత్వ శాఖలో, ఏ ఏజెన్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు వచ్చినయో చెప్పిన అని తెలిపారు.

ఒకవేళ నేను చెప్పిన లక్షా 30 వేల ఉద్యోగాలు, ప్రభుత్వంలో కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో కానీ, ఒక్క లెక్క తప్పున్నా, ముక్కు నేలకు రాసి విరమించుకుంటా అని సవాల్‌ చేశారు. ఒకప్పుడు కోయగూడెంలో కానీ, తండాలో కానీ, గ్రామంలో కానీ 5 నుండి 10 మంది చదువుకునేవారు, ఇవ్వాళ 50 నుండి 100 మంది ఉన్నారు. వాళ్లందరికీ ఉద్యోగాలు రావలంటే ప్రభుత్వంలోనే రావు అని అన్నారు. ప్రభుత్వంలో 1% ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, ప్రజలకు సేవ చేయడానికి 4 కోట్ల జనాభాలో 4 లక్షల మంది ఉంటారు అని అన్నారు. ఈ ప్రభుత్వం ఒచ్చిన తర్వాత 16 లక్షల కొత్త ఉద్యోగాలు ప్రైవేటులో ఒచ్చినయి అని రాజేశ్వర్‌ రెడ్డి స్పష్టం చేశారు.

కోయగుడాల్లో అబద్ధపు ప్రచారం జరుగుతుంది, టీఆర్ఎస్ పార్టీ కొందరికే ఉపయోగపడింది అని… 1,30,000 ఉద్యోగాల్లో రిజర్వేషన్ తూచా తప్పకుండా పాటించి, ఎవరికి దక్కాల్సిన ఉద్యోగాలు వాళ్లకు దక్కినయి అని అన్నారు. ఇంకో 50-60 వేల కొత్త ఉద్యోగాలు ఒస్తున్నాయి అని అన్నారు. 1000 కోట్లతో ఎస్సీ, ఎస్టీ మరియు బీసీల్లో ఉన్న పేదవారికోసం, యువత కోసం సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం ఏప్రిల్ 1 నుండి రాబోతుంది అని అన్నారు. మీకు కలెక్టరేట్ కొత్తగూడెంలో వచ్చింది, అనేక కొత్త పరిశ్రమలు ఈ ప్రాంతంలో రాబోతున్నాయి. ఈ ఆరేళ్లలో అందరి సమస్యలు ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకపోయిన అని అన్నారు.ప్రశ్న వేయడం కష్టం కాదు. ప్రశ్నకి సమాధానం వెతకాలి, పరిష్కార కేంద్రం దగ్గరికి తీసుకపోవాలి, పరిష్కారం చూపించాలి అని పల్లా రాజేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు.