పాలకుర్తి రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. పాలకుర్తి నియోజకవర్గానికి చెందిన అసంతృప్తి నేతలు తాజాగా కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్‌ను కలిసి తమ వైఖరిని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో జరిగిన ఈ భేటీ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఈ సమావేశంలో తొర్రూరు మార్కెట్ చైర్మన్ తిరుపతి రెడ్డి, PAC చైర్మన్ కాకిరాల హరిప్రసాద్, కాంగ్రెస్ సీనియర్ నేత కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలకుర్తి పరిధిలోని మేజర్ గ్రామ పంచాయతీల అంశంపై వారు మీనాక్షితో విస్తృతంగా చర్చించారు. పార్టీ లోపలి అసంతృప్తులు, స్థానిక నాయకత్వంపై ఉన్న అభ్యంతరాలను ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.
ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పాలకుర్తిలో కీలకమైన మేజర్ గ్రామ పంచాయతీలను కోల్పోయింది. అయితే, పార్టీకి వ్యతిరేకంగా ఉన్న అసంతృప్తి నేతలు పది మేజర్ గ్రామ పంచాయతీలను గెలిపించుకుని తమ బలం చాటుకున్నట్లు రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇది నియోజకవర్గ రాజకీయ సమీకరణాల్లో మార్పులకు దారితీయవచ్చని భావిస్తున్నారు.
అదే సమయంలో మేజర్ గ్రామ పంచాయతీలను గెలిపించుకోవడంలో ఝాన్సీ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పాలకుర్తి పంచాయతీ రాజకీయాలు మీనాక్షి నటరాజన్ చుట్టూ కేంద్రీకృతమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత చర్చలు మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.
Also Read:‘జన నాయగన్’ విడుదల వాయిదా

