న్యూస్ లైవ్‌ షోలో కొట్టుకున్న నేతలు..

363
Pakistan TV
- Advertisement -

పాక్‌లో ఒక విచిత్రమైన సంఘటన చోటుచేసుకుంది. అదొక లైవ్ కార్యక్రమం అని కూడా మరిచిన రెండు పార్టీల నేతలు, స్టూడియోను అరుపులు, కేకలతో హోరెత్తించడమే కాకుండా ఒకరిపై మరొకరు చేయి చేసుకునేంత వరకూ పరిస్థితి వెళ్లింది. ఇదంతా పాకిస్థాన్‌కు చెందిన ఓ న్యూస్ ఛానల్‌లో జరిగింది. వివరాల్లోకెళ్తే.. పాకిస్తాన్‌కు చెందిన ఓ న్యూస్‌ ఛానల్‌లో ‘న్యూస్‌ లైన్‌ విత్‌ అఫ్తబ్‌ ముఘేరి’ అనే లైవ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఆ ఛానల్‌ వార్తా వ్యాఖ్యాత, పాకిస్తాన్‌ తెహ్రీక్‌-ఇ-ఇన్సాఫ్‌(పీటీఐ) పార్టీకి చెందిన మసూర్‌ అలీ సియల్‌తో పాటు కరాచీ ప్రెస్‌ క్లబ్‌ అధ్యక్షుడైన ఇంతియాజ్‌ ఖాన్‌ పాల్గొన్నారు.

కార్యక్రమం లైవ్‌లో ప్రసారం అవుతుండగానే వారిద్దరి మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. దీంతో టీవీ స్టూడియో ఇద్దరి అరుపులతో మారుమోగింది. ఇలాంటివి తాను లెక్కచేయనంటూ పీటీఐ నేత మసూర్‌ అలీ, ఇంతియాజ్‌ను హెచ్చరించాడు. అంతే స్థాయిలో ఇంతియాజ్‌ ఆయనపై విరుచుకుపడడంతో ఇద్దరి మధ్య గొడవ తీవ్రరూపం దాల్చింది.

ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకునేదాకా వెళ్లింది. దీంతో అక్కడున్న వారు కలగచేసుకొని ఇద్దరికీ సర్దిచెప్పడంతో ఇంతియాజ్‌ స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోగా, అలీ వెనక్కు వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. పీటీఐ నేత వ్యాఖ్యాతపై సైతం విరుచుకుపడ్డాడు. టీవీ స్టూడియోలో జరిగిన ఈ మొత్తం సంఘటనకు సంబంధించిన వీడియోను అక్కడున్న ఓ జర్నలిస్టు వీడియో తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

- Advertisement -