పాక్ స్పందించింది. పాకిస్థాన్ పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మొహమ్మద్ ఫైసల్ క్లారిటీ ఇచ్చారు. గుజరాత్ ఎన్నికల్లో పాకిస్థాన్ జోక్యం చేసుకుంటున్నదన్న మోదీ ఆరోపణలను ఫైసల్ ఖండించారు. ‘మీ ఎన్నికల్లో మమ్ముల్ని లాగడం ఆపేయాలి. ప్రధాని మోదీ ఆరోపణలు నిరాధారమైనవి’ అని తన ట్విట్టర్ అకౌంట్‌లో ఫైసల్ తెలిపారు.
అంతేకాకుండా కల్పితమైన కుట్ర ఆరోపణలకు బదులు సొంత బలంతో ఎన్నికలను గెలిచే ప్రయత్నం చేయాలని, ఈ కుట్ర కథనాలు ఆధారరహితం, బాధ్యతారాహిత్యం అన్నారు మహమ్మద్ ఫైసల్. ఇదిలాఉంటే..పాకిస్థాన్ అధికారులతో కాంగ్రెస్ నేతలు మణిశంకర్ అయ్యర్ నివాసంలో రహస్యంగా భేటీ అయ్యారని గుజరాత్ ఎన్నికల ప్రచార సభలో ఆదివారం మోదీ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మోదీ ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ కూడా తీవ్రంగా మండిపడింది.
మోదీ నిరాధార ఆరోపణలు చేశారని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా తెలిపారు. రెండేళ్ల కిందట ప్రధాని మోదీ పాకిస్థాన్‌లో అనూహ్యంగా ఆగి.. అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట పెళ్లి వేడుకకు ఎందుకు హాజరయ్యారని ప్రధానిని సుర్జేవాలా ప్రశ్నించారు.కాగా.. అత్యున్నత పదవిలో ఉన్న మోదీ ఓటమి భయంతో అనుచిత ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ అభిప్రాయపడింది.