PACS…నామినేటెడ్ పద్ధతిలోనే!

2
- Advertisement -

రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ఎన్నికల నిర్వహణపై ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతోంది. ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లకుండా, కేవలం నామినేటెడ్ పద్ధతిలో కమిటీలను భర్తీ చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణలోని సహకార సంఘాల పదవీకాలం ముగియడంతో ఎన్నికలు నిర్వహించాల్సిన తరుణంలో, ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. క్షేత్రస్థాయిలో ఎన్నికలు నిర్వహిస్తే ఎదురయ్యే సవాళ్లను దృష్టిలో ఉంచుకుని, నామినేటెడ్ పద్ధతిలో తమ పార్టీ నాయకులను నియమించుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

రాజకీయ వర్గాల్లో మరియు రైతాంగంలో జరుగుతున్న చర్చ ప్రకారం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తమకు పూర్తిస్థాయిలో అనుకూలంగా లేవని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చని, ఇది ప్రభుత్వ ప్రతిష్టపై ప్రభావం చూపుతుందని కాంగ్రెస్ అగ్రనాయకత్వం ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. పార్టీ కోసం కష్టపడిన ద్వితీయ శ్రేణి నాయకులకు, కార్యకర్తలకు పదవులు కట్టబెట్టడానికి నామినేషన్ పద్ధతి సులువైన మార్గమని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రభుత్వ నిర్ణయంపై విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నాయి. ఇది కేవలం రాజకీయ స్వార్థం కోసం తీసుకున్న నిర్ణయమని వారు ఆరోపిస్తున్నారు.ఎన్నికలు పెడితే రైతులు బుద్ధి చెబుతారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన నామినేటెడ్ కమిటీలను వేయాలని చూస్తోంది. ఇది సహకార రంగాన్ని నిర్వీర్యం చేయడమేనన్నారు.

Also Read:ప్రతిష్టాత్మకంగా భారత్-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్!

సహకార సంఘాలు రైతులకు వెన్నెముక వంటివి. రాజకీయ ప్రయోజనాల కోసం ఎన్నికలను వాయిదా వేయడం లేదా నామినేటెడ్ పద్ధతిని అనుసరించడం వల్ల క్షేత్రస్థాయిలో అసలైన రైతు నాయకులకు అన్యాయం జరిగే అవకాశం ఉంది. ఈ నిర్ణయంపై న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యే అవకాశం కూడా లేకపోలేదు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునరాలోచించుకుంటుందో లేక మొండిగానే ముందుకు వెళ్తుందో వేచి చూడాలి.

- Advertisement -