ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో ఏర్పాటుచేసిన మైనారిటీ రెసిడెన్షియల్ స్కూళ్లు ఎంతో సామాజిక మార్పుకు దోహదపడుతున్నాయని మజ్లిస్ నేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. మైనార్టీ సంక్షేమంపై సీఎం కేసీఆర్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. సమావేశం అనంతరం మాట్లాడిన ఓవైసీ పదేళ్లలో ఓ విప్లవం చూస్తామని..చాలా మంది ముస్లింలు తమ పిల్లలను రెసిడెన్షియల్ స్కూళ్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారన్నారు. బోధన, వసతి,ఆహారం బాగున్నాయని ప్రశంసించారు.
మైనారిటీ సంక్షేమం కోసం అన్నిరకాల వ్యయాల కన్నా రెసిడెన్షియల్ స్కూళ్ల కోసం పెట్టే ఖర్చు తనకు ఎంతో తృప్తినిస్తుందని ఈ సందర్భంగా సీఎం అన్నారు. రేపటి తరానికి మంచి విద్యను అందించడం కన్నా మించిన ఆస్తి ఏదీ లేదని చెప్పారు. తమకు సెక్షన్లు పెంచమని అదనపు స్కూళ్లు కావాలని ఎమ్మెల్యేల నుంచి డిమాండ్ వస్తుందని తెలిపారు.
మైనార్టీల సంక్షేమానికి అధికారులు మరింత శ్రద్ధతో పని చేయాలని ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో మైనార్టీలు లబ్ధి పొందేలా కార్యాచరణ ఉండాలన్నారు. మైనార్టీ యువకులకు పూర్తి రాయితీతో రూ. 2 లక్షల ఆర్థిక సాయం అందించాలన్న సీఎం.. బ్యాంకులతో సంబంధం లేకుండా ఆర్థిక సాయం చేయాలన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కల్చరల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కోకాపేటలో 10 ఎకరాల్లో హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఇస్లామిక్ కన్వెన్షన్ సెంటర్ నెలకొల్పుతామని తెలిపారు. మూడు వారాల్లోగా ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభం కావాలని సీఎం కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో అత్యవసర పనులకు నిధులు మంజూరు చేయాలని అధికారులకు సూచించారు. అత్యవసర పనుల కోసం ఎస్‌డీఎఫ్ నుంచి రూ. 40 కోట్లు విడుదల చేయాలని సీఎం ఆదేశించారు.