డేరా సచ్చా సౌదా కేంద్రంగా గుర్మిత్ రామ్ రహీం సాగించిన అరాచకాలు రోజుకొకటి వెలుగుచూస్తున్నాయి. ఇద్దరు సాథ్వీలపై అత్యాచారం కేసులో అరెస్టు అయి జైలు శిక్ష అనుభవిస్తున్న డేరాబాబా ఓ కామపిశాచి అని వైద్యులు తేల్చి చెప్పారు. ఇన్నాళ్లుగా అనుభవించిన సుఖవంతమైన జీవితం అంతమై 20 ఏళ్లు జైలు శిక్ష పడిన సంగతి తెలిసిందే. డేరా సచ్చా సౌధా అధిపతి గుర్మీత్ రామ్ రహీమ్ చేసిన ఘోరాలకు సంబంధించి విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
తాజాగా సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో దాదాపు 600 అస్థిపంజరాలు ఉన్నట్లు గుర్మీత్ మద్దతుదారుడు ఒకరు తెలిపారు. గుర్మీత్ కేసు విచారిస్తున్న సిట్ బృందం విచారణకు హాజరైన గుర్మీత్ మద్దతుదారుడు ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఎంతో మందిని చంపేసి ప్రధాన కార్యాలయంలోనే పాతిపెట్టినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో డేరా మాజీ సభ్యుడు డా. పి.ఆర్. నైన్, డేరా ఛైర్‌పర్సన్ విపాసనను సిట్ బృందం విచారించింది.
జర్మనీకి చెందిన ఓ శాస్త్రవేత్త సలహా మేరకు అస్థిపంజరాలను పాతి పెట్టిన స్థలంలో మొక్కలు నాటారని డాక్టర్ నైన్ సిట్ బృందానికి తెలియజేశారు. గతంలో కూడా డేరా ఆశ్రమంలో వందల సంఖ్యలో అస్థిపంజరాలు ఉన్నాయని ఓ స్థానిక పాత్రికేయుడు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.