అమెరికాలో వలసలపై ట్రంప్ ప్రభుత్వం కఠిన వైఖరి కొనసాగిస్తోంది. అక్రమ వలసలతో పాటు చట్టబద్ధ వలసలపైనా ఆంక్షలు పెంచుతూ, పని లేదా చదువు కోసం అమెరికాకు రావాలనుకునే వారిపై నిబంధనలను మరింత కఠినతరం చేసింది. నేర కార్యకలాపాలను కారణంగా చూపుతూ 2025లో ఇప్పటివరకు లక్షకు పైగా వీసాలను అమెరికా రద్దు చేసింది. ఇందులో వేల సంఖ్యలో విద్యార్థి వీసాలు, ప్రత్యేక (స్పెషలైజ్డ్) వీసాలు కూడా ఉన్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవిలోకి వచ్చిన తర్వాత ఈ రద్దులు జరిగాయని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ వెల్లడించింది. ఇది రికార్డు స్థాయిలో వీసాల రద్దు అని పేర్కొంది.
ఈ పరిణామం ద్వారా, అమెరికా వలస చట్టాలను కఠినంగా అమలు చేయడంలో ట్రంప్ ప్రభుత్వ నిబద్ధత స్పష్టమవుతోంది. వీసాతో అమెరికాలో ఉన్నవారు అక్కడి చట్టాలను ఖచ్చితంగా పాటించాల్సిందేనని స్టేట్ డిపార్ట్‌మెంట్ మరోసారి హెచ్చరించింది.
ఇప్పటివరకు 1 లక్షకు పైగా వీసాలను రద్దు చేశాం. ఇందులో నేరాలకు పాల్పడిన వారివిగా సుమారు 8,000 విద్యార్థి వీసాలు, 2,500 ప్రత్యేక వీసాలు ఉన్నాయి అని పేర్కొంది. అమెరికా భద్రత కోసం ఈ గూండాలను దేశం నుంచి పంపిస్తూనే ఉంటాం అని కూడా స్పష్టం చేసింది. స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ డిప్యూటీ స్పోక్స్‌పర్సన్ టామీ పిగాట్ మాట్లాడుతూ..ఒక సంవత్సరంలోపే ట్రంప్ ప్రభుత్వం లక్షకు పైగా వీసాలను రద్దు చేసింది. వీటిలో దాడులు, దొంగతనం, మద్యం తాగి వాహనం నడపడం వంటి నేరాల్లో ఆరోపణలు ఎదుర్కొన్న లేదా దోషులుగా తేలిన వేల మంది విదేశీయులు ఉన్నారు అని తెలిపారు.
Also Read:KTR:కాంగ్రెస్ పార్టీ పతనం తప్పదు
2025లో రద్దైన వీసాల సంఖ్య…2024లో రద్దైన 40,000 వీసాల కంటే రెండింతలు ఎక్కువ.2025లో ఎక్కువగా వ్యాపార, పర్యాటక వీసాలపై వచ్చినవారు వీసా గడువు మించి ఉండటంతో రద్దులు జరిగాయి. అయితే నేరాలకు పాల్పడిన కారణంగా 8,000 మంది విద్యార్థులు, 2,500 మంది ప్రత్యేక వీసా దారులు కూడా తమ వీసాలను కోల్పోయారు.

