తెలంగాణ కాంగ్రెస్ ప్రస్తుతం దూకుడు మీద ఉంది. కర్నాటక ఎన్నికల్లో ఆ పార్టీ సాధించిన ఘనవిజయం టి కాంగ్రెస్ నేతలకు మంచి బూస్టప్ ఇచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే కర్నాటక ఎన్నికల ముందు టి కాంగ్రెస్ లో ఉన్న పరిస్థితులు వేరు.. ప్రజెంట్ ఉన్న పరిస్థితులు వేరు. అంతకుముందు పార్టీలోనే అంతర్గత విభేదాల కారణంగా కాంగ్రెస్ బలహీన పడుతూ వచ్చింది. దాంతో నేతలు ఎవరికి వారే యమున తీరే అన్నట్లు వ్యవహరించారు. ఆ పార్టీ కూడా రాష్ట్రంలో రెండవ స్థానం నుంచి మూడో స్థానానికి పడిపోయినట్లే కనిపించింది. దాంతో కాంగ్రెస్ పనైపోయిందనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల్లో విజయం టి కాంగ్రెస్ కు ఊపిరినిచ్చింది.
నిన్నటి వరకు ఎడమొఖం పెడమొఖంగా ఉన్న నేతలందరూ ఇప్పుడు మేమంతా ఒక్కటే అనే సంకేతాలు ఇస్తున్నారు. దీంతో ఇదే జోష్ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలు పెడితే పార్టీకి మంచి మైలేజ్ వస్తుందని భావించిన అధిష్టానం.. ఆ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. అంతకంటే ముందు ఒకప్పుడు పార్టీలో సీనియర్ నేతలుగా ఉండి.. ఆ తరువాత పార్టీని వీడిన నేతలను తిరిగి సొంత గూటికి చేర్చుకుంటే.. ఇతర పార్టీలలోని అసంతృప్త నేతలను ఆకర్షించవచ్చు అనే అభిప్రాయంలో హస్తం హైకమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ” ఆపరేషన్ ఘర్ వాపసి ” స్టార్ట్ చేసింది. ఒకప్పుడు పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి, వివేక్ వంటి వారితో పాటు ఈటెల రాజేంద్ర కు కూడా బహిరంగంగానే వెల్కం పలుకుతోంది.
Also Read: మణిపూర్ సంక్షోభ నివారణకు కమిటీ: అమిత్ షా
అయితే వారంతా పార్టీ మారేది లేదని తేల్చి చెబుతున్నప్పటికి.. అంతర్గతంగా వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారనే వాదన పెరుగుతోంది. ఎందుకంటే ఈటెల రాజేంద్ర, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటివారు బిజెపిలో చేరి చాలా రోజులైనప్పటికి.. ఇంతవరకు సరైన ప్రాధాన్యం లభించలేదు. దీంతో వీరంతా ఎప్పుడైనా కండువా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఇటీవల కాంగ్రెస్ వీడిన ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా తిరిగి సొంత గూటికి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. అందుకే నేతల అసంతృప్తిని గ్రహించిన హస్తం హైకమాండ్ ” ఘర్ వాపసి ” ని మొదలు పెట్టింది. అంతే కాకుండా తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చిన వారికి సరైన ప్రాధాన్యం ఇస్తామని కూడా చెబుతోంది. దీంతో ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో ” కాంగ్రెస్ ఘర్ వాపసి ” హాట్ టాపిక్ గా మారింది. మరీ ఈ వ్యూహం కాంగ్రెస్ కు ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.
Also Read: అంతుచిక్కని డీకే వైఖరి !