“గాంధీ కడుపున గాంధీ పుట్టడు, ఎన్టీఆర్ కడుపున ఎన్టీఆర్ పుట్టడు, మెగాస్టార్ కడుపున మెగాస్టార్ పుట్టడు.. ఎవరైనా సరే ప్రజల్లో నుంచే రావాలి వివిధ రూపాల్లో వివిధ పేర్లతో.. సమ్ పీపుల్ ఆర్ కమింగ్ సమ్ పీపుల్ ఆర్ గోయింగ్”.. ఇలా పదునైన సంభాషణలతో శతాధిక చిత్రాల కథానాయకుడు, మైటీస్టార్ శ్రీకాంత్ మరోసారి ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘మహాత్మ’, ‘ఆపరేషన్ దుర్యోధన’ వంటి పవర్‌ఫుల్ చిత్రాల తర్వాత మరోసారి అటువంటి పవర్‌ఫుల్ పాత్రలో ఆయన నటించిన చిత్రం ‘ఆపరేషన్ 2019’. “బివేర్ ఆఫ్ పబ్లిక్” అనేది ట్యాగ్ లైన్. అలివేలమ్మ ప్రొడక్షన్స్ పతాకంపై అలివేలు నిర్మించిన ఈ చిత్రానికి కరణం బాబ్జి దర్శకత్వం వహించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ నెలలో తెరపైకి రానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ కార్యక్రమం గురువారం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి.వినాయక్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ వేడుకకు శ్రీకాంత్ సహా చిత్ర యూనిట్ హాజరయ్యింది.
ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ “ట్రైలర్ చాలా బాగుంది. డైరెక్టర్ షార్ట్ మేకింగ్ చాలా బాగుంది. ఈ సినిమాకి మంచి పేరు రావాలి, అలాగే ప్రొడ్యూసర్‌కి బాగా డబ్బులు రావాలి. శ్రీకాంత్ భయ్యా అంటే ఇండస్ట్రీలో అందరికీ ఇష్టమే. నాకైతే మరీ ఇష్టం. ఎందుకంటే ఆయన ఎంత మంచి నటుడో అంత మంచి మనిషి. ఎందరికో హెల్ప్ చేశాడు. ఈ సినిమా అందరికీ మంచి పేరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.
సీనియర్ నటుడు శివకృష్ణ మాట్లాడుతూ, “ఏ నటుడు యాక్ట్ చేసినా ఆ సినిమా ఆడాలని మనస్పూర్తిగా కోరుకుంటాను. అలా ఆడితేనే ఇండస్ట్రీ మూడు పూవులు ఆరు కాయలుగా ఉంటుంది. ఈ సినిమా కోసం అందరూ బాగా కష్టపడ్డారు. శ్రీకాంత్ మంచి నటుడే కాదు, మంచి సంస్కారం ఉన్న వ్యక్తి కూడా” అని అన్నారు.
నటుడు సమీర్ మాట్లాడుతూ “నేను ఈ సినిమాలో తొలుత ఒక రోల్ చేయాల్సింది. కాని మెడికల్ ఎమర్జెన్సీ వల్ల మిస్ అయ్యాను. అదే విషయం శ్రీకాంత్‌తో చెప్పాను. కట్ చేస్తే.. కొద్ది రోజుల తర్వాత ఇదే టీమ్ నుంచి వేరే రోల్ ఆఫర్ వచ్చింది. శ్రీకాంత్ ప్రొడ్యూసర్స్ హీరో. ఏ సినిమా చేసినా ప్రొడ్యూసర్ తరఫున ఆలోచిస్తారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకుంటారు” అని అన్నారు.
ఈటీవీ ప్రభాకర్ మాట్లాడుతూ “ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. శ్రీకాంత్ డిఫరెంట్ గెటప్, రోల్స్ చేసిన ప్రతీ సినిమా కూడా అతనికి మంచి పేరుతో పాటు మంచి విజయాన్ని కూడా అందించాయి. ఈ కోవలోనే ‘ఆపరేషన్ దుర్యోధన’, ‘మెంటల్ పోలీస్’ బాగా ఆడాయి. ఇలాంటి పాత్రలు చేస్తూ..యంగ్ హీరోలకి ఇన్‌స్ఫిరేషన్‌గా ఉన్నారు. నాకు తెలిసి తెలుగులో ఇలా చేసే హీరోలు తక్కువ. ఇప్పుడు యంగ్ హీరోస్ కూడా డిఫరెంట్ రోల్స్ చేయడం హ్యాపీగా ఉంది. నేను ఎన్నో సినిమాల్లో నటించినా నాకు మంచి పేరు తీసుకొచ్చింది మాత్రం ‘ఆపరేషన్ దుర్యోధన’. దాని గురించి ఎక్కడికెళ్ళినా మాట్లాడుతూ ఉంటారు. అడుగుతూ ఉంటారు. ఇంకా బాబ్జిగారి గురించి చెప్పాలంటే.. ఆయన మంచి రైటర్. సమాజానికి కావలసిన సబ్జెక్టును తీసుకుని డీల్ చేయడంలో మంచి దిట్ట. ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
కథానాయిక యజ్ఞా శెట్టి మాట్లాడుతూ “టెక్నికల్‌గా ఇది నా ఫస్ట్ తెలుగు ఫిల్మ్, ఇంతకు ముందు ‘కిల్లింగ్ వీరప్పన్’లో చేసాను. డైలాగులు చెప్పేటప్పుడు శ్రీకాంత్‌గారు అందించిన సహకారం మరచిపోలేనిది” అని అన్నారు. ఫైట్ మాస్టర్ సతీష్ మాట్లాడుతూ “నా లైఫ్‌లో మంచి ఫైట్స్ కంపోజింగ్ చేసిన సంతృప్తి ఈ సినిమా నాకు కలిగించింది. ఈ సినిమాకి సంబంధించి.. శ్రీకాంత్ సహకారం మరవలేనిది” అని అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ మాట్లాడుతూ “ఇంత కమర్షియల్ మూవీని నా చేతిలో పెట్టిన శ్రీకాంత్ గారికి ధన్యవాదాలు” అని అన్నారు. నటుడు రామ్‌జగన్ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకులకి, పరిశ్రమకి అందరికీ ఇష్టమైన నటుడు శ్రీకాంత్. ఆయన బాగుండాలనీ, ఆయన కుటుంబం బాగుండాలని ఎప్పుడూ కోరుకుంటాను” అని అన్నారు.
‘దిల్’ రమేష్ మాట్లాడుతూ “నటుడిగా నాకు ‘దిల్’ 50వ సినిమా. ఆ సినిమాని డైరెక్ట్ చేసిన వి.వి.వినాయక్ ఈ ట్రైలర్ ఫంక్షన్‌కి హాజరవడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కోసం నేను శ్రీకాంత్ గారితో 25 రోజుల పాటు ప్రయాణం చేసాను. మంచి పాత్ర దక్కింది. మంచి పేరు తీసుకువస్తుందన్న నమ్మకం ఉంద”ని అన్నారు. యాక్టర్ జెన్ని మాట్లాడుతూ “శ్రీకాంత్ హీరోగా చేసిన చాలా సినిమాల్లో నటించాను. ఆయనతో జర్నీ మరువలేనిద”ని అన్నారు.
దర్శకుడు కరణం బాబ్జి మాట్లాడుతూ “సినిమా ఆడాలంటే స్టార్‌లు అవసరం లేదని ‘మహానటి’ నిరూపించింది. ఒక సినిమా ఆడాలంటే మంచి నటీ నటులు కుదరాలి. ఈ సినిమాకి అటువంటి నటీనటులే కుదిరారు. ఏ హీరో కూడా బట్టలు లేకుండా పోస్టర్‌పైన కనిపించాలంటే ఒప్పుకోడు. అలాంటి దమ్ము శ్రీకాంత్‌లో ఉంది. అందుకే ఆయన ఒప్పుకున్నారు. ఇందులో ముగ్గురు యంగ్ హీరోలు ఉన్నారు. వాళ్ళెవరో సినిమా చూసేటప్పుడు మీకే అర్ధం అవుతుంది. ‘లజ్జా’ సినిమాలో కథానుసారం మనీషా కోయిరాలాతో పాటు కొంత మంది ఆర్టిస్టులు ట్రావెల్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా అలానే ఉంటుంది. పకడ్బందీ స్క్రీన్‌ప్లేతో పూర్తి చేసిన సినిమా ఇది. సినిమా కంప్లీట్ అయింది. జూన్ 15కల్లా సెన్సార్ పూర్తయిపోతుంది. డి.ఐ.కార్యక్రమాలు జరుగుతున్నాయి. జూన్ నెలాఖరులో ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాము. ఆర్టిస్టులందరినీ బాగా ఇబ్బంది పెట్టి మంచి అవుట్‌పుట్ తీసుకున్నాననే అనుకుంటున్నాను. శ్రీకాంత్‌తో ఇలాంటి ఎక్స్‌పరిమెంటల్ మూవీస్ మరిన్ని చేయాలని కోరుకుంటున్నాను” అని అన్నారు.
నటి దీక్షాపంత్ మాట్లాడుతూ “బ్యూటీఫుల్ రోల్, సాంగ్ చేసాను. ఈ సినిమా బాగా వచ్చింది. మంచి పేరు తీసుకొస్తుందని నమ్మకం ఉంద”ని అన్నారు.
ఆర్టిస్ట్ గిరిధర్ మాట్లాడుతూ “శ్రీకాంత్‌తో నాకిది మూడో సినిమా. అయితే ఆయన కాంబినేషన్‌లో సీన్స్ లేవు. రామ్‌జగన్, ప్రసన్న కుమార్ కాంబినేషన్‌లో సీన్స్ ఉంటాయి. శ్రీకాంత్ గురించి మాట్లాడుతూ ఉంటాము కాని.. శ్రీకాంత్‌తో కాంబినేషన్ సీన్స్ ఉండవు. నటుడుగా ఆయన శిఖర స్థాయిని చూశారు. అంత స్థాయి చూసినా చిన్న స్థాయిలో ఉన్న వాళ్ళను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు” అని అన్నారు.
నిర్మాత అలివేలు మాట్లాడుతూ “శ్రీకాంత్ పడిన కష్టమంతా ట్రైలర్‌లో చూసాం. మంచి డైరెక్టర్ కుదిరారు. ఆర్టిస్టులందరూ సహకరించారు. అందరికీ మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంద”ని అన్నారు.
జర్నలిస్ట్ ప్రభు మాట్లాడుతూ “శ్రీకాంత్‌తో నా జర్నీ 32 ఏళ్ళ నుంచి కొనసాగుతోంది. హీరోగా, విలన్‌గా ఇలా అన్ని పాత్రలతోనూ మెప్పించారు. శ్రీకాంత్ పరిశ్రమకు పరిచయమైన కొత్తల్లో తన గురించి “ఎవరీ శ్రీకాంత్?” అని ఒక ప్రత్యేకంగా ఆర్టికల్ రాశాను. అప్పటినుంచి మా మధ్య అనుబంధం కొనసాగుతోంది. ప్రారంభం నుంచి చివరి రోజు వరకు ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్‌తో రిలేషన్స్ బాగుండడమనేది అరుదుగా జరుగుతూ ఉంటుంది. నిర్మాత ఈ సినిమాను డబ్బుల కోసం కాకుండా ఒక ప్యాషన్‌తో చేసారు. ఇలాంటి నిర్మాతలు నిలబడాలి. మంచి హీరో, డైరెక్టర్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. రియల్ లైఫ్ హీరోస్ చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళల్లో శ్రీకాంత్ ఒకరు” అని అన్నారు.
కథానాయకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ “వి.వి.వినాయక్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన డౌన్ టు ఎర్త్ పర్సన్. అలాగే.. ఫస్ట్ నుంచి ఫినిష్ అయ్యేవరకు ప్రొడ్యూసర్ హ్యాపీగా నవ్వుతూనే ఉన్నారు. మంచి ఆర్టిస్టులను సినిమాలో పెట్టి చేశారు. ఆర్టిస్టులందరినీ ఇలా వేదికపైకి పిలిపించి ఒక ఫంక్షన్‌లా చేయడం చాలా హ్యాపీగా ఉంది. డైరెక్టర్ కరణం బాబ్జితో ‘మెంటల్ పోలీస్’ తర్వాత చేసిన సినిమా ఇదే. సినిమా తప్ప వేరే ధ్యాస ఉండదతనికి. ప్రమోషన్స్ కూడా చాలా బాగా చూసుకుంటారు. పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో జరిగే సినిమా ఇది. ఇందులో నా గెటప్ కొత్తగా ఉంటుంది. ఎప్పుడూ కూడా హీరోస్‌ని డైరెక్టర్స్ హీరో, ప్రొడ్యూసర్స్ హీరో అని అంటూ ఉంటారు. ఈ సినిమా విషయానికొచ్చేసరికి ఈ డైరెక్టర్‌ని ప్రొడ్యూసర్స్ డైరెక్టర్ అని అనాలి. ఈ సినిమాలో భాగంగా అమెరికాలో నాలుగు రోజుల పాటు షూటింగ్ ఉంది. అయితే బాబ్జీ నిర్మాణ ఖర్చులు తగ్గించడానికి నాతో.. “సర్, మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ మీకున్న నెట్‌వర్క్‌తో మీరే మేకప్, మీరే కెమెరా అరేంజ్ చేసుకోవాలి” అని చెప్పారు. “నేనొక్కడినే ఎలా వెళ్ళాలి?” అనుకున్నాను. అయితే అక్కడ నాకున్న ఫ్రెండ్స్, కెమెరా ఎక్విప్మెంట్స్‌తో నేనే మేకప్ వేసుకుని.. అక్కడ ఉన్న వరప్రసాద్ సహకారంతో నాలుగు రోజుల పాటు షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుని వచ్చాను. యూనిట్ కూడా అక్కడికి వచ్చి ఇలా షూటింగ్ చేసి ఉంటే.. లక్షల్లో ఖర్చు అయి ఉండేదేమో. ఏదేమైనా ఖర్చు తగ్గించడం కోసం డైరెక్టర్ పడ్డ తపన మెచ్చుకోకుండా ఉండలేము. క్రెడిట్ అంతా డైరెక్టర్‌కే దక్కుతుంది. సినిమా చాలా బాగా వచ్చింది” అని అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొడ్యూసర్ తనయుడు తులసీరామ్, ఆర్టిస్టులు శ్రీనివాస్, టార్జాన్, వెంకటేష్ గౌడ్, వేణు గోపాల్, ‘గబ్బర్ సింగ్’ బ్యాచ్, తిరుపతి దొరై, రమేష్ రాజు, బ్యాంక్ విజయ్, రేణుక, వర్మ, తిలక్, హెచ్.ఎం.టీవీ సుజాత, బిహెచ్ఇఎల్ ప్రసాద్, పబ్లిసిటీ డిజైనర్ మరియు నటుడు వీవా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.