వెలుగుల దీపావళి వచ్చేసింది. క్రాకర్స్ కోసం మార్కెట్కి వెళ్లి కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. షాపులన్నీ తిరిగి.. రేట్లతో విసిగిపోవాల్సిన అవసరం కూడా లేదు. దీపావళిని క్యాష్ చేసుకునేందుకు ఇటు షాపులతో పాటు అటు ఆన్‌లైన్లో ఈ-కామర్స్ సైట్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో పడ్డాయి. డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు తదితర ఆఫర్లతో ఊదరగొడుతున్నాయి. 30-70 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నాయి.
దీపావళికి వస్తువులు బయటి మార్కెట్ కంటే ఆన్ లైన్ లోనే తక్కువ ధరకు లభిస్తున్నాయి. షాపులన్నీ తిరిగి.. రేట్లతో విసిగిపోయిన వారికి అనుకూలమైన ధరలో.. వారికి కావాల్సిన బడ్జెట్ లో క్రాకర్స్ లభిస్తుండడంతో చాలామంది ఆన్లైన్ కొనుగోళ్లకే ఆసక్తి చూపిస్తున్నారు. పలు వెబ్ సైట్లు నిర్వహిస్తున్న ఆన్ లైన్ లావాదేవీలు పెద్దమొత్తంలో ఉంటున్నాయి. దీపావళి పుణ్యమా అని క్రాకర్స్, ప్రమిదల బిజినెస్ మూడు చిచ్చుబుడ్లు.. ఆరు భూచక్రాలుగా సాగుతోంది.. ఒక్క మౌస్ క్లిక్ తో కోరుకున్న పటాకులు, ప్రమిదలు ఇంటి వద్దకే తీసుకొస్తున్నాయి. సమయం ఆదా అవుతుండటంతో నగరవాసులు ఆన్లైన్ లో జోరుగా కొనుగోలు చేస్తున్నారు.
దీపావళి పండుగ సీజన్‌ను పురస్కరించుకుని ఆన్‌లైన్‌లో ధరల్లో డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లు, అదనపు భారం లేని ‘ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్’ (ఇ.ఎం.ఐ)లు, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు – ఇలా బోలెడు ఆఫర్లతో ఇ కామర్స్ సైట్లు హల్ చల్ చేస్తున్నాయి. ధరల్లో డిస్కౌంటే సగటున 40 నుంచి 50 శాతం పైనే ఉంది. అందుకే, ఇప్పటి దాకా కొనకుండా ఆగినవాళ్ళు కూడా ఆన్‌లైన్‌లో కావాల్సినవి బుక్ చేసేస్తున్నారు.
కాగా, ఇప్పటికే ఆన్లైన్ అమ్మకాల ద్వారా అనేక మోసాలు జరుగుతున్న నేపథ్యంలో ఫేక్ వెబ్ సైట్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. భారీ డిస్కౌంట్లను చూసి మోసపోవద్దని.. మంచి కంపెనీలకు సంబంధించిన వెబ్ సైట్ల నుంచి మాత్రమే కొనుగోలు చేస్తే మంచిదని సూచిస్తున్నారు.