సుమారు రూ.500 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకున్న ఆదిపురుష్ సినిమా. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం టీజర్‌పై ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రావణాసురుడి పాత్రధారి అయిన సైఫ్ అలీఖాన్ లుక్‌పై విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. గతంలో వచ్చిన రామాయణం సీరియల్‌లోని రావణాసురుడి లుక్‌ని ఆదిపురుష్‌లోని లుక్‌తో పోల్చుతూ పలువురు నెటిజన్లు వ్యంగాస్త్రాలు విసురుతున్నారు. దీనిపై తాజాగా దర్శకుడు ఓం రౌత్ స్పందించారు.
“రావణాసురుడు క్రూరత్వం కలిగిన వ్యక్తి. లుక్స్‌తోనే ఆయన క్రూరత్వాన్ని చూపించాలి. గతంలో రామానంద్ సాగర్ తెరకెక్కించిన రామాయణంలో పొడవాటి జుట్టు, గంభీరమైన చూపులు, భారీ ఆకారంలో రావణాసురుడిని చూపించారు. ఆనాటి రోజుల్లో క్రూరత్వాన్ని ఆ విధంగా తెలియజేశారు. కానీ ఇప్పటితరం భవిష్యత్తు తరాలకు తెలియజెప్పాలనుకుంటున్నా అందుకు అనుగుణంగానే రావణాసురుడి లుక్‌ని డిజైన్ చేశాం. రావణాసురుడు ఒక భయంకరమైన పక్షిపై ప్రయాణిస్తున్నట్లు టీజర్‌లో చూపించాం అయితే దాన్ని కూడా అందరూ తప్పుపడుతున్నారు. కేవలం 95సెకన్ల వీడియో చూసి ఒక అభిప్రాయానికి రావొద్దు. సినిమా చూశాక మాట్లాడండి. ఇక సినిమాలో హనుమంతుడికి లెదర్ దుస్తులు వేశామని అందరూ విమర్శిస్తున్నారు. నిజం చెప్పాలంటే మేము ఎలాంటి లెదర్ దుస్తులు ఉపయోగించలేదు”. అని ఓం రౌత్ వివరణ ఇచ్చారు.
రామాయణాన్ని ఆధారంగా చేసుకుని ఆదిపురుష్ చిత్రాన్ని ఓం రౌత్ తెరకెక్కించారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడిగా, సీత పాత్రలో కృతి సనన్, రావణాసురుడి పాత్రలో సైఫ్ ఆలీఖాన్ నటించారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుందని ఇటివలే చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.