బాలీవుడ్ నట శిఖరం ఓం పురి కన్నుమూశారు. ఇవాళ ఉదయం ముంబైలోని ఆయన నివాసంలో గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. 66 ఏళ్ల ఓం పురి భారతదేశం గర్వించదగ్గ నటుల్లో ఒకరు. హిందీ సినిమాల ద్వారా పాపులర్ అయిన ఓం.. పలు ప్రాంతీయ, అంతర్జాతీయ చిత్రాల్లోనూ నటించారు. ఎనమిది సార్లు ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్న ఆయన 1990లో పద్మ శ్రీ అవార్డును అందుకున్నారు.
1950 అక్టోబర్ 18న హర్యానాలో జన్మించారు. 1976లో మరాఠి చిత్రంతో సినీ రంగ ప్రవేశం చేసిన ఓం పురి ఎన్నో వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకున్నాడు. ఉత్తమనటుడిగా రెండు సార్లు జాతీయ అవార్డులను అందుకున్నారు. తెలుగులో ‘అంకురం’ చిత్రంలో నటించిన ఆయన రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘రాత్రి’ సినిమాలో మాంత్రికుడి పాత్రలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. తెలుగుతో పాటు కన్నడ, పంజాబీ చిత్రాలతో పాటు పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ కీలక పాత్రలు చేశారు.
అరోహన్,అర్ధసత్య సినిమాలకు ఉత్తమ నటుడి అవార్డుని అందుకున్నారు. నాలుగున్నర దశాబ్దాల కెరీర్‌లో ఓంపురి తొలిసారి ‘న మాలూమ్ అఫ్రాద్’, ‘యాక్టర్ ఇన్ లా’ అనే రెండు పాకిస్థానీ చిత్రాల్లో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం.ఓం పురి మృతి తీరని లోటని బాలీవుడ్ నటులు సంతాపం ప్రకటించారు. ఓం పురి మరణం షాక్ కు గురిచేసిందని మరో సీనియర్ నటుడు అనుపం కేర్ పేర్కొన్నారు.