అమెరికాలో అత్యంత గౌరవప్రదంగా ఆరాధించే వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మరోసారి వార్తల్లో నిలిచారు. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను వెనక్కి నెట్టి ఒబామా ఈ ఘనత సాధించారు. ప్రజాభిప్రాయ సేకరణలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు 14 శాతం ఓట్లు రాగా, ఒబామాకు 17 శాతం వచ్చాయి.
ఒబామా ఇలాంటి అపూర్వ గౌరవం పొందడం వరుసగా ఇది పదోసారి. ట్రంప్ సతీమణి మెలానియా కేవలం ఒక్క శాతం మాత్రమే సాధించారని సర్వేలో తేలింది. 1946 నుంచి మొదలు ఇప్పటివరకు ఈ సర్వే 71 సార్లు నిర్వహించారు. ఇందులో అధికారంలో ఉన్న అధ్యక్షులే 58 సార్లు ప్రథమ స్థానంలో నిలిచారు. అత్యధికంగా బిల్ క్లింటన్ 22 సార్లు ఈ గౌరవాన్ని పొందారు.
అమెరికాకు అధ్యక్షుడైన మొట్టమొదటి ఆఫ్రికన్ అమెరికన్ సంతతికి చెందిన వ్యక్తిగా ఒబామా చరిత్ర సృష్టించారు. చక్కటి వ్యూహరచన, యుక్తి, చాతుర్యవంతమైన ప్రణాళికతో ముందుకు సాగడం, ఇతరులకు సహాయపడే గుణం, నిజాయతీతో కూడిన వ్యవహార శైలితో అధ్యక్షుడిగా ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రజలను మెప్పించాయి.