ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. మార్చి 29న(రేపు) సినిమా ప్రారంభం కానున్నట్లు దర్శకుడు తేజ ఫేస్ బుక్ ద్వారా తెలిపారు. నాచారంలోని రామకృష్ణ స్టూడియోస్‌లో ఉదయం 9.42 గంటలకు క్లాప్ పడనుంది. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నట్లు చిత్ర యూనిట్ పోస్టర్‌ని విడుదల చేసింది.
బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈచిత్రానికి తేజ దర్శకత్వం వహిస్తున్నారు. చాలా రోజులుగా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం బ్యానర్‌పై బాలకృష్ణ స్వయంగా నిర్మిస్తున్నారు.
ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్‌గా ఎలాంటి న్యూస్ బయటికి రాలేదు. అయితే తాజాగా ఓ పోస్టర్‌ని విడుదల చేసింది చిత్రయూనిట్. సినిమాలో ఏఏ అంశాలను చూపించబోతున్నారన్న విషయాన్ని తెలిపేలా పోస్టర్ ను రూపొందించారు. ఎన్టీఆర్ సొంత ఊరిలోని ఇళ్లు వెండితెరపై ఎన్టీఆర్ పోషించిన అద్భుత పాత్రలను కలిపి పోస్టర్‌ని డిజైన్ చేశారు. దీంతో పాటు ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం,టీడీపీ స్థాపన,ఆయన ఉపయోగించిన ప్రచార రథంతో పాటు పార్టీ జెండా కూడా ఉండేలా డిజైన్ చేసిన పోస్టర్ అందిరిని ఆకట్టుకుంటోంది.
మరోవైపు దర్శకుడు రాంగోపాల్ వర్మ,కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డిలు సైతం ఎన్టీఆర్ జీవిత చరిత్రపై సినిమాలు తీస్తుండగా అందరి దృష్టి మాత్రం తేజ-బాలయ్య కాంబినేషన్‌లో రానున్న సినిమాపైనే ఉంది.