మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం ఎన్టీఆర్. ఈ సినిమాకు క్రిష్ దర్శకత్వం వహించగా నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ పాత్రలో నటించారు. ఈ బయోపిక్‌ను రెండు భాగాలుగా రూపొందించగా తొలి భాగం ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ సంక్రాంతికి విడుదలైంది. రెండో భాగం ఎన్టీఆర్ మహానాయకుడు ఫిబ్రవరి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేందుకు సిద్ధంగా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా మహానాయకుడు నుంచి ఒక ట్రైలర్ విడుదల చేశారు. రాజకీయ నాయకుడిగా ఎన్టీఆర్ ప్రజల్లోకి వెళ్లడం .. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు.. ఢిల్లీ రాజకీయాలను ఎదిరించిన తీరు .. బసవతారకం అనారోగ్యానికి గురికావడం.. ఇలా ఆయనను కదిలించిన సంఘటనలు.. కలచివేసిన సన్నివేశాలు చూపించారు. “నిశ్శబ్దాన్ని చేతగానితనం అనుకోవద్దు .. మౌనం మారణాయుధంతో సమానమని మరిచిపోకు’ అంటూ ‘మహానాయకుడు’ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలు పెంచుతుందనడంలో సందేహం లేదు అని పిస్తుంది.