స్వర్గీయ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొని ఎన్టీఆర్కు శ్రద్ధాంజలి ఘటించారు.
ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తన తండ్రి ఎన్టీఆర్కు ఘన నివాళులు అర్పిస్తూ పుష్పగుచ్ఛం సమర్పించారు. అలాగే ఎన్టీఆర్ సతీమణి లక్ష్మీపార్వతి కూడా ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు.
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ, “ఎన్టీఆర్ ఎన్నేళ్లు గడిచినా ప్రజల గుండెల్లో శాశ్వతంగా జీవించే మహనీయుడు. పేదవాడి ఆకలిని గుర్తించి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. ఆయన ప్రవేశపెట్టిన పథకాలే నేటికీ వివిధ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి” అని అన్నారు. ఎన్టీఆర్ సామాజిక న్యాయానికి ప్రతీక అని కొనియాడారు.
సీనియర్ నటుడు బాబు మోహన్ ఎన్టీఆర్ను తలుచుకుంటూ భావోద్వేగ వ్యాఖ్యలు చేశారు. “ఎన్టీఆర్ నా దేవుడు. ఆయన నన్ను ‘తమ్ముడు’ అని సంభోదించేవారు. భూమి ఉన్నంతవరకు నా దేవుడు ఎన్టీఆర్ బతికే ఉంటారు. అన్నగారు మళ్లీ పుట్టి నటుడిగా మరోసారి వెలుగు వెలగాలి” అని అన్నారు.
Also Read:ఆఫ్రికా దేశాల్లో ప్రకృతి విలయతాండవం
ఈ కార్యక్రమంలో మంత్రి నారా లోకేశ్ కూడా పాల్గొని ఎన్టీఆర్కు నివాళులర్పించారు. ప్రజాసేవ, రాజకీయాలు, సినిమా రంగాల్లో ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని పలువురు నేతలు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఏర్పడిన ఈ దృశ్యాలు ఆయనకు ఉన్న ప్రజాదరణను మరోసారి చాటిచెప్పాయి.

