మహానటుడు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తనయుడు బాలకృష్ణ బయోపిక్ తెరకెక్కించాలనుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు తేజ చెప్పడంతో ఇప్పుడు ఈ బయోపిక్‌పై సందిగ్ధత నెలకొంది. తేజ తప్పుకోవడంతో బాలకృష్ణ మరో సమర్థవంతమైన దర్శకుడి కోసం మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారు.
సీనియర్ దర్శకుడు రాఘవేంద్రరావు పేరు మొదటగా వినిపించినా.. ఆ రేసులో తాను లేనని ఆయన స్పష్టం చేశారు. తర్వాత చారిత్రాత్మక చిత్రం గౌతమి పుత్ర శాతకర్ణికి దర్శకత్వం వహించిన క్రిష్‌ని బాలకృష్ణ సంపద్రించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రస్తుతం మరో పేరు తెరపైకి వచ్చింది.
గోపాల గోపాల, కంచె, ఖైదీ నంబర్ 150, గౌతమీపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలకు మాటలు అందించిన సాయి మాధవ్ ఎన్టీఆర్ బయోపిక్‌ని డైరెక్ట్ చేయనున్నట్లు ఫిలింనగర్లో ఈ వార్త హల్చల్ చేస్తుంది. మరోవైపు బాలకృష్ణనే స్వయంగా ఈ బయోపిక్‌కి దర్శకత్వం వహించే అవకాశం ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది. కానీ ఇప్పటి వరకు ఈ బయోపిక్‌పై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మరి ఎవరి దర్శకత్వంలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కనుందే తెలవాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.