దేశంలో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా సెకండ వేవ్ మొదలై దేశ ప్రజలను మళ్లీ భయపెడుతోంది. కరోనా లాక్‌డౌన్ కాలంలో లక్షలాది వలసకూలీల నెత్తుటి వ్యధలను చూసి దేశప్రజలు తల్లిడిల్లిపోయినా ప్రధాని మోదీ మనసు చలించలేదు. వలసకూలీలను వారి స్వస్థలాలకు చేర్చాలన బాధ‌్యతను కూడా మర్చి కర్కోటకంగా వ్యవహరించాడు. పైగా కరోనా వైరస్ పారిపోవాలంటే దేశ ప్రజలంతా రాత్రి 7 గంటలకు నిలబడి గంటలు మోగించండి..చప్పట్లు కొట్టండి..దీపాలు వెలిగించండి అంటూ డ్రామాలతో దేశ ప్రజలను ఏమార్చారు. కరోనా వైరస్ టీకా తీసుకువచ్చామంటూ చెప్పి ఇంత వరకు ఆ టీకా పని చేస్తుందా లేదా అనే నమ్మకం కలిగించలేకపోయారు. గతంలో కరోనా నియంత్రణ కోసం యావత్ దేశాన్ని అకస్మాత్తుగా లాక్‌డౌన్ చేసేసిన మోదీ ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రతాపం చూపుతుంటే బెంగాల్, తమిళనాడు, అసోం, కేరళ, పుదుచ్చేరిలో గెల్చేందుకు భారీ బహిరంగ సభలకు జనాలను తరలిస్తూ కరోనా వైరస్ వ్యాప్తికి కారకులు అవుతున్నారు.
ఇక రైతు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతుల ఉద్యమాన్ని నిరంకుశంగా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు వరుసగా ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ పేరుతో తన గుజరాతీ సంపన్నులైన అంబానీలు, అదానీలకు అప్పజెబుతూ దేశాన్ని వారికి తాకట్టు పెడుతున్నాడు. అందుకేమో కరోనా వైరస్ కన్నా బీజేపీ పాలనే వెరీ డేంజర్ అంటున్నారు తమిళనాడుకు చెందిన ఓ నేత. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా జరుగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు, అభ్యర్థులు వారిపై హమీల వర్షం కురిపిస్తున్నాయి. అధికార అన్నాడీఎంకే – బీజేపీ కూటమి ఆల్ ఫ్రీ అంటూ ఓటర్లకు తాయిలాలు ప్రకటిస్తోంది. జల్లికట్టు..ఉద్యోగం పట్టు అంటూ తమిళనాడు యువతకు బీజేపీ గాలం వేస్తోంది. అయితే ఎంత ప్రయత్నించినా ఈసారి అన్నాడీఎంకే, బీజేపీ కూటమికి ఘోర పరాజయం తప్పదని, డీఎంకే – కాంగ్రెస్ కూటమే అధికారంలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
తమిళనాడు ఎన్నికల్లో చిన్నాచితక పార్టీలు కూడా పోటీ చేస్తున్నాయి. ఆ పార్టీల నేతలు కూడా బీజేపీని టార్గెట్ చేసుకుని విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా రాశిపురం ప్రచార సభలో పాల్గొన్న నామ్‌తమిళర్ కట్చి నాయకుడు సీమాన్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగాడు. కరోనా వైరస్ కన్నా బీజేపీ పాలనే విషపూరితమని, బీజేపీ పాలనలో బ్రతకటం కన్నా కరోనా తాకిడికి గురై బ్రతకటం చాలా సులువని సీమాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రజాసంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోని పాలకులే ఉన్నారని మోదీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. బీజేపీ పాలనలో భారతదేశం మనది అని సామాన్యులు గర్వంగా చెప్పుకోలేని దుస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అదానీ, అంబానీలే భారతదేశం తమది అంటూ గర్వంగా చెప్పుకుంటున్నారని పరోక్షంగా మోదీపై మండిపడ్డారు. బీజేపీ పాలనలో అన్ని రంగాలు ప్రైవేటుపరమైపోయాయని ఆరోపించారు. కరోనా వైరస్ కన్నా బీజేపీ పాలనే మహా చెడ్డది అంటూ సీమాన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సీమాన్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది. అవును..కరోనా వైరస్ బారిన పడినా తట్టుకుని ప్రాణాలు నిలుపుకోవచ్చు..కాని మోదీ పాలనలో దేశంలో కనీసం సామాన్యుడు బతకలేని పరిస్థితి నెలకొందని సీమాన్ వ్యాఖ్యలకు మద్దతుగా తమిళనాడు ప్రజలు బీజేపీపై విరుచుకుపడుతున్నారు. ఏదేమైనా ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీమాన్ అన్నట్లు కరోనా వైరస్ కంటే బీజేపీ పాలనే వెరీ డేంజర్ అని చెప్పకతప్పదు.