జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ నాయకత్వం అవసరముందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నారైలు అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఎన్నారైల కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆదివారం నిర్వహించిన జూమ్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టగా, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఉన్న భారత ఎన్నారైలు ముక్తంకంఠంతో ఆమోదించారు. ఈ సందర్భంగా మహేశ్ బిగాల మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రాదనుకున్న తెలంగాణను తెచ్చి అభివృద్ధిలో తీసుకెళ్తున్న గొప్ప నాయకుడని పేర్కొన్నారు. ఇప్పుడు దేశంలో గుణాత్మక మార్పు అవసరమని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమన్నారు. ఈ పరిస్థితుల్లో కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించే దిశగా అడుగులు ముందుకు పడుతున్నాయని చెప్పారు.
దేశంలో అపారమైన వనరులున్నా.. పాలకులకు వాటిని వాడుకునే నైపుణ్యాలు, నిబద్ధత లేకుండా పోయిందని మహేశ్ బిగాల పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన ఎజెండా ఏదీ అమలు కావడం లేదన్నారు. పార్లమెంటు సమావేశాల్లో ప్రజల అవసరాలపైన మాట్లాడదామన్నా జైశ్రీరాం నినాదాలు చేస్తూ అడ్డుకుంటున్నారని చెప్పారు .ఈ నెల 19 లోగా కార్యవర్గ సమావేశం నిర్వహించి, టీఆర్ఎస్‌ను భారత రాష్ట్ర సమితిగా మార్చే అంశంపై తుది నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయన్నారు. తమవంతుగా వివిధ దేశాల్లో ఉన్న అన్ని రాష్ట్రాల వారికీ తెలంగాణ ఏవిధంగా అభివృద్ధి చెందిందో వివరించి, మద్దతు కూడగడుతామని మహేశ్ బిగాల స్పష్టంచేశారు.వివిధ దేశాలనుంచి ఎన్నారైలు మాట్లాడుతూ, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ స్ఫూర్తిని చాటుతూ, ప్రస్థానం కొనసాగించిన తీరును గుర్తు చేశారు. ఎన్నారైలందరూ సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతించారు.
అనిల్ కూర్మాచలం (యూకే): దేశంలో జరుగుతున్న పరిణామాలను యావత్ ప్రపంచం చూస్తోంది. దేశంలో బీజేపీ మతచిచ్చు పెట్టి గల్ఫ్ బిడ్డల బతుకులు ఆగంజేస్తున్నరు. అన్ని సూచీల్లో భారత్ కిందికి వెళ్లిపోయింది. దేశంలో వనరులున్నా వాటిని వాడుకునే నైపుణ్యం ప్రస్తుత పాలకులకు లేదు. అందుకే 70 ఏళ్లలో అరిగోస పడ్డ తెలంగాణను ఎనిమిదేళ్లలో సుదరాయించిన కేసీఆర్‌కే దేశాన్ని నడిపించే శక్తి ఉందని నమ్ముతున్నా. బిగాల మహేశ్ ప్రవేశపెట్టిన తీర్మానికి మద్దతు తెలుపుతున్నా అన్నారు.
నాగరాజు గుర్రాల (సౌతాఫ్రికా): 75 ఏండ్లలో ఎక్కువ కాలం జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్ పాలించినా దేశంలో గుణాత్మక మార్పు రాలేదు. పరిస్థితి నానాటికీ దిగజారింది , ఈ క్రమంలో పోరాటాల ఖిల్లా అయిన తెలంగాణే తన నమూనాను దేశవ్యాప్తం చేసి, జాతికి మార్గం చూపాల్సిన అవసరం ఉన్నది. ఇందుకు జాతీయ పార్టీ ఏర్పాటు ఒక్కటే పరిష్కారం. సీఎం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అన్నారు.
జగన్ (న్యూజిలాండ్): జాతీయ రాజకీయాల్లోకి రావాలనే కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. తెలంగాణను ఎట్లా అభివృద్ధి చేశారో దేశాన్ని అదేబాటలో నడిపిస్తారనే నమ్మకం మాకుంది. న్యూజిలాండ్ తరఫున పూర్తి మద్దతు తెలుపుతున్నాం అని చెప్పారు.
రాజేశ్ (సిడ్నీ): కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం..ఆస్ట్రేలియాలో నాలుగేళ్ల క్రితమే టీఆర్ఎస్ శాఖ మొదటి సమావేశం నిర్వహించాం. జాతీయ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ రావాలని కోరుకుంటున్నాం అన్నారు.
అశోక్ దుసారి (యూకే): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలనే తీర్మానానికి యూకే ఎన్నారైల తరఫున మద్దతు తెలుపుతున్నాం. దేశంలో మార్పు రావాలి. అది కేసీఆర్‌తోనే సాధ్యం అన్నారు.
శ్యామ్ బాబు ఆకుల (డెన్మార్క్): జై తెలంగాణ, జై భారత్ తీర్మానానికి డెన్మార్క్ ఎన్నారైల తరఫున సంపూర్ణ మద్దుతు తెలుపుతున్నాం. దేశాన్ని అభివృద్ధిబాట పట్టిస్తారని కేసీఆర్‌పై మాకు నమ్మకం ఉంది. మన పథకాలు దేశమంతా విస్తరిస్తే ఆటోమేటిక్‌గా దేశం అభివృద్ధి చెందుతుందన్నారు.
చిట్టిబాబు (మలేషియా): భారత్ మాతా కీ జై. ఇప్పటికైనా సరైన నాయకుడు కేసీఆర్ రూపంలో కేంద్రంలోకి వెళ్తున్నారు. మలేషియా ఎన్నారైలమంతా ఆయనకు మద్దుతగా నిలుస్తాం అన్నారు.
రాహుల్ (జాంబియా): తెలంగాణలాగే దేశం కూడా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి చెందుతుంది. దేశానికి తెలంగాణ మోడల్ ఇప్పుడు చాలా అవసరం. జాంబియా ఎన్నారైలమంతా కేసీఆర్ వెంటే ఉంటాం అన్నారు.
రాజేష్ హిప్పారాజ్, మహారాష్ట్ర (సౌతాఫ్రికా): నాది మహారాష్ట్ర. నేను సౌతాఫ్రికాలో ఉంటున్నా.. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంత అభివృద్ధి చెందిందో చూస్తున్నా. అన్ని రాష్ట్రాల ప్రజలు చూస్తున్నారు. మా రాష్ట్ర ఎన్నారైల తరఫున కేసీఆర్‌కు మద్దతు ఇస్తున్నా అన్నారు.
శ్రీధర్ (ఖతర్): సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. దేశ ప్రజల శ్రేయస్సు కోసం కేంద్రంలో కేసీఆర్ నాయకత్వం ఉండాలి. బాయ్‌కాట్ ఇండియా అనే స్లోగన్‌ను తీసుకొచ్చిన ఘనత మోడీకే దక్కింది. దానినుంచి దేశాన్ని కేసీఆరే రక్షించాలన్నారు.
శ్రీధర్ (స్విట్జర్లాండ్): సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని ఆహ్వానిస్తున్నాం. స్విట్జర్లాండ్ ఎన్నారైల తరఫున హర్షం వ్యక్తంచేస్తున్నాం. సీఎం కేసీఆర్ వెంటే ఉంటాం అన్నారు.
అరవింద్ (జర్మనీ): తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. జర్మన్ మీడియాలో కూడా బీజేపీ వాళ్ల మాటలు చాలా ఇబ్బందిపెట్టాయి. కేంద్రంలో కేసీఆర్ ఉంటేనే దేశంలో ముందుకు పోతుందన్నారు
మహిపాల్ (ఒమన్): అందరికీ శుభాభివందనాలు… ఒమన్ ఎన్నారైల తరఫున సీఎం కేసీఆర్ నిర్ణయంపై హర్షం వ్యక్తంచేస్తున్నాం. మా సంపూర్ణ మద్దతు ఉంటుంది.
సతీశ్ (బహ్రెన్): తీర్మానానికి సంపూర మద్దతు ఇస్తున్నాం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి సంతోషకరం. దేశం గర్వించేలా తెలంగాణను అభివృద్ధి చేశారు. ఇప్పుడు దేశం వంతు వచ్చింది.
కృష్ణప్రసాద్ (సింగపూర్): తీర్మానానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. బీఆర్ఎస్‌తో కేసీఆర్ దేశాన్ని అభివృద్ధి బాటపట్టిస్తారనే గట్టి నమ్మకంతో ఉన్నాం. మా సహకారం ఉంటుంది.
కృష్ణ (కెనడా): సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పుడు దేశానికి బలమైన నాయకుడు కావాలి. ఆ నాయకుడు సీఎం కేసీఆరే. తెలంగాణ పథకాలన్నీ దేశవ్యాప్తంగా అమలుకావాలి.
రవీందర్ (చైనా ): మహేశ్ బిగాల తీర్మానానికి మద్దతు తెలుపుతున్నాం. ఎనిమిదేళ్లలోనే తెలంగాణ రూపు రేఖలు మార్చిన నాయకుడు సీఎం కేసీఆర్. ఇప్పుడు దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తారు.
అఫ్రోజ్ ఖాన్ (ఖతర్): ప్రస్తుత బీజేపీ సర్కారు వల్ల దేశ ప్రజలు ఖతర్‌లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మతం పేరుతో బీజేపీ ఆడుతున్న రాజకీయ క్రీడకు బలవుతున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడమే దీనికి విరుగుడు. ఆయనకు మా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం అన్నారు.
రజినీకాంత్ (యూఎస్ఏ): బీఆర్ఎస్‌కు మా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం. కేసీఆర్ కచ్చితంగా దేశ రాజకీయాల్లో ఉండాలి. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపించాలి.
రంగారెడ్డి బద్దం (పెరూ): దేశంలో అపార వనరులున్నాయి. వాటిని వినియోగించడంలో ప్రస్తుత పాలకులు విఫలమయ్యారు. అందుకే దేశం అధోగతిపాలైంది. కేసీఆర్ నాయకత్వంలోనే దేశం బాగుపడుతుందన్నారు.వీరితోపాటు యూకే నుంచి నవీన్, సృజనరెడ్డి, రమేశ్‌బాబు, హరి, సురేశ్, కల్యాణ్, కిరణ్, న్యూజిలాండ్, సౌతాఫ్రికా తరపున నరేందర్‌రెడ్డి, హరీశ్ రంగా, అరవింద్ ప్రసాద్, సుఖేశ్, వెంకట్‌రావు తాళ్లపల్లి, నరేశ్ యాదారి, అరవింద్ ప్రసాద్, పరశురామ్ (సిడ్నీ) , కువైట్ నుంచి సురేశ్, రవికాంత్, జర్మనీ నుంచి కిశోర్, స్విట్జర్లాండ్ నుంచి శ్రీనివాస్, నార్వే నుంచి సుమన్, వివిధ దేశాల ప్రతినిధులు మహేశ్ బిగాల ప్రవేశపెట్టిన తీర్మానానికి మద్దతు తెలిపారు.