లండన్ : రాష్ట్రంలో ఏప్రిల్ 30న గ్రేటర్ వరంగల్ మరియు ఖమ్మం కార్పోరేషన్లతో పాటు సిద్దిపేట, అచ్చంపేట, నకిరేకల్, జడ్చెర్ల, కొత్తూరు మున్సిపాలిటీలకు జరగబోయే ఎన్నికల్లో టీ.ఆర్.ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎన్నారై టి.ఆర్.ఎస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఏడేండ్లుగా రాష్ట్రంలో ప్రతి ఇంటా సంక్షేమం.. ఇంటి ముందు అభివృద్ధి కనిపిస్తున్నాయని, ఇదిలాగే కొనసాగాలంటే ప్రజలంతా కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపర్చాలని, అందుకే టి.ఆర్.ఎస్ అభ్యర్థులకే ఓటెయ్యాలని నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
కరోనా సమయంలో, వరదలు సంభవించినప్పుడు తెలంగాణ ప్రభుత్వం వరంగల్ ప్రజలను అన్ని విధాలుగా ఆదుకుందని అన్నారు. అయితే కేంద్ర ప్రభుత్వం వరంగల్ ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా తెరాస అభివృద్ధి చేసిందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా బీజేపీ, కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తుందని నవీన్ మండపడ్డారు. ప్రజలు తప్పుడు ప్రచారాలు నమ్మొద్దని, ఇంటింటికి తిరిగి ప్రచారం చేసే పరిస్థితి లేదు. మమ్ములను నమ్మండి, అభివృద్ధి చేసే భాద్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానిది అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం మీద కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు.
ఈ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ నాయకులు చెప్పే మాటలు విని మోసపోవద్దు అని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా అమలు కావడం లేదు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచి టి.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇంటింటికీ మంచినీరు అందించిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఈ రెండేళ్లలో అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు ఇస్తామన్నారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు, 65 ఏళ్ల వయసు 57 ఏళ్లకు కుదించి కొత్త పెన్షన్లు ఇవ్వనుందని తెలిపారు.
కేసీఆర్ గారితో సహా వారి కుటుంబ సభ్యులు కేటీఆర్ గారు, సంతోష్ గారు కరోనా బారిన పడడం మమ్మల్ని బాధించిందని, వారంతా త్వరగా కోలుకొని ప్రజల ముందుకు రావాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని నవీన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్న ఎన్నారై తెరాస నాయకులు అనిల్ కూర్మాచలం, అశోక్ గౌడ్ దూసరి, సిక్కా చంద్రశేఖర్ గౌడ్, సతీష్ రెడ్డి, చిలుముల సత్యమూర్తి, పృథ్వీ రావుల స్థానిక కరోనా పరిస్థితులని బట్టి క్షేత్రస్థాయి ప్రచారంలో పాల్గొంటారని నవీన్ రెడ్డి తెలిపారు. దేశంలో కరోనా ఉదృతి ఎక్కువ ఉన్నందున ప్రజలంతా తప్పకుండా మాస్క్ ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని, ప్రభుత్వానికి సహకరించి మిమ్మల్ని మీరు కాపాడుకొని ఇతరులకు కరోనా సోకకుండా బాధ్యతగా వ్యవహరించాలని నవీన్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.