బొగ్గు గనుల ప్రైవేటీకరణ…వెనక్కి తీసుకోవాలి

210
sccl
- Advertisement -

లండన్ : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బొగ్గు గనుల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం(టీబీజీకేఎస్) గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సింగరేణి బొగ్గు గనుల్లో కార్మికులు సమ్మెకు దిగి నిరసన వ్యక్తం చేస్తున్నారని, వారందరికీ ఎన్నారై టి.ఆర్.యస్ అండగా ఉందని ఎన్నారై టి.ఆర్.యస్ యూకే కార్యదర్శి సత్యమూర్తి చిలుముల తెలిపారు.

వేలాది మంది కార్మికులకు ప్రత్యక్షంగా, లక్షలాది కుటుంబాలకు పరోక్షంగా ఉపాధి కల్పించే బొగ్గు గనులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉందని, మాలో ఎంతో మంది ఎన్నారై బిడ్డలు సింగరేణి కార్మికుల కుటుంబాల నుండి వచ్చినవారు కూడా ఉన్నారని నేడు కేంద్ర ప్రభుత్వ వైఖరిని మేమంతా వ్యతిరేకిస్తున్నామని సత్యమూర్తి తెలిపారు.

ప్రైవేట్ చేతులకి అప్పగిస్తే రానున్న రోజుల్లో బొగ్గు ధర పెరిగి విద్యుత్ ధర కూడా సామాన్యులకు భారమయ్యే లాగ తారాస్థాయికి చేరుకుంటుందన్నారు. విదేశీ కంపెనీలకు దోచిపెట్టడానికే కేంద్రం బొగ్గుగనుల ప్రైవేటీకరణ అంశాన్ని ముందుకు తెచ్చిందని ఆరోపించారు.

బొగ్గు గన్నుల్లో పుట్టి పెరిగిన నాకు కార్మికుల పరిస్థితులు తెలుసని ప్రైవేటీకరణతో వారి జీవితం ప్రమాదంలో పడుతుందని,కేంద్ర ప్రభుత్వం చర్యలతో బొగ్గు గని కార్మికుల హక్కులను కాలరాసే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వ బొగ్గు పరిశ్రమ నిర్వీర్యం అవుతుందని, వెంటనే బీజేపీ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సత్యమూర్తి డిమాండ్ చేశారు.

ఎన్నారై సమాజమంతా సింగరేణి కార్మికుల వెంటే ఉందని, బొగ్గు గనుల ప్రైవేటీకరణ పై కేంద్ర వైఖరి మారాలని, అవసరమైతే కేంద్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చేలా ఎటువంటి పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామని సత్యమూర్తి తెలిపారు.

- Advertisement -