పెద్దనోట్ల రద్దు కష్టాలు ప్రజలను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. పెద్ద నోట్ల రద్దు ప్రకటన చేసి 20 రోజులు కావస్తున్న ఇంకా సమస్య తీరలేదు. బ్యాంకుల్లో, ఏటీఎంలో డబ్బులు చాలినంతగా అందుబాటులో లేకపోవడంతో ప్రజలు ఇంకా పడిగాపులు కాస్తూనే ఉన్నారు. అయితే అసలే డబ్బులు లేక ప్రజలు నానా అవస్థలు పడుతుంటే..వాటికి తోడు బ్యాంకుల మూత మరో పెద్ద సమస్యగా మారింది. ఈనెల 26, 27 బ్యాంకులకు సెలవు దినం కావడంతో..బ్యాంకులు పూర్తీగా తెరుచుకోలేదు.
ఈ ఉదయం కొన్ని పార్టీలు భారత్ బంద్ కు, మరికొన్ని పార్టీలు నిరసన ప్రదర్శనలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆ ప్రభావం చాలా స్వల్పంగా కనిపిస్తోంది. పలు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు యథాప్రకారం తిరుగుతున్నాయి. ఇదే సమయంలో బంద్, నిరసనల నుంచి బ్యాంకులకు మినహాయింపు ఇచ్చినప్పటికీ, అది ప్రజలకేమీ ఉపయోగపడటం లేదు. ఈ ఉదయం 10 గంటలకు బ్యాంకులు తెరచుకున్నప్పటికీ, ఏ బ్యాంకులోనూ నగదు లేకపోవడంతో విత్ డ్రా కోసం వచ్చిన కస్టమర్లను లోపలికి అనుమతించడం లేదు. దీంతో బంద్ నుంచి మినహాయింపు ఉన్నా, తమకు బ్యాంకుల వల్ల వీసమెత్తు ఉపయోగం లేకపోయిందని ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుండగా, ఈ మధ్యాహ్నం తరువాత బ్యాంకులకు నగదు చేరే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంటున్నారు.